
సాక్షి,అమరావతి: పోలీసులపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే ఉపేక్షించం అంటూ హెచ్చరించింది. గుత్తి కొండకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త పఠాన్ కరీమ్ గతంలో టీడీపీ నేతలపై ఓ కేసు పెట్టారు. ఆ కేసు విత్‌డ్రా చేసుకోవాలంటూ పఠాన్‌పై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు.
ఈ మేరకు పఠాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై పఠాన్ భార్య ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
విచారణలో భాగంగా హైకోర్టులో విచారణకు హాజరైన పిడుగురాళ్ల టౌన్ సిఐ వెంకట్రావుపై ప్రశ్నలు వర్షం కురిపించింది.కేసు రాజీ చేసుకోమని పిడుగురాళ్ల సీఐ వెంకటరావు ఎలా వేధించాడో ధర్మాసనానికి పఠాన్ కరీమ్ వివరించారు. విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోలీసులు ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు. కేసు రాజీ చేసుకోవాలని ఎలా ఒత్తిడి తీసుకొస్తారో.. ఎలా బెదిరిస్తారో కూడా తెలుసు. మాకు ఏమీ తెలియదు అనుకోవద్దు. అలా అనుకునేందుకు మేమేం ఐఫిల్ టవర్‌పై కూర్చోలేదు
ఎప్పుడో ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారు.ఇలాంటివి మేము రోజు చూస్తూనే ఉన్నాం. పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సివిల్ వివాదంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదు. పిడుగురాళ్ల టౌన్ సీఐ జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టుకు రావచ్చు అని కరీంకు ధర్మాసనం చెప్పింది.