
అమరావతి: తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్దరించేలా ఆదేశాలు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు(శుక్రవారం) ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తన భద్రత విషయంలో వరుస ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్న కారణంగా జడ్ ప్లస్ కేటగిరీ భద్రత పునరుద్దరించేలా వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరగ్గా, వైఎస్ జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.‘
‘వైఎస్ జగన్‌కు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. జగన్‌కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. కావాలనే జగన్ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే భద్రతకు సంబంధించిన అంశంపై ఒక రిట్ పిటిషన్ పెండింగ్ లో ఉంది’అని వైఎస్ జగన్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.