ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం

AP Govt Will Be Released Jobs Calendar Tomorrow - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి : దేశంలో ఎక్కడా, ఎవరూ చేపట్టని రీతిలో గత రెండేళ్లలో 6,03,756 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. తాజాగా 10,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను శుక్రవారం (నేడు) ఆయన విడుదల చేయనున్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్న సీఎం.. నిరుద్యోగులకు అండగా ఉండేలా మరిన్ని ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుడుతున్నారు. 2021–22లో భర్తీకి నిర్ణయించిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే నెల నుంచే విడుదల కానున్నాయి. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఏపీపీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, డీఎస్సీ తదితర నియామక సంస్థల ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. అత్యంత పారదర్శకంగా, అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్‌ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయనుంది.

అత్యంత పారదర్శకంగా భర్తీకి ఏర్పాట్లు
ప్రభుత్వ పోస్టులను ఎలాంటి అవినీతి, అక్రమాలకు, లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శక విధానంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో బాగంగా విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. గ్రూప్‌–1, గ్రూప్‌–2తో సహా అన్ని ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించారు. రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించే మెరిట్‌ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పరీక్షల నిర్వహణకు ఐఐటీ, ఐఐఎంల సహకారంతో విప్లవాత్మక విధానాన్ని రూపొందించనున్నారు. 

పోస్టుల భర్తీలో కొత్త చరిత్ర
దేశ చరిత్రలో ఎక్కడా, ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 నుంచి ఇప్పటి వరకు 6,03,756 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో రెగ్యులర్‌ పోస్టులు 1,84,264, కాంట్రాక్టు పోస్టులు 19,701, అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు 3,99,791 ఉన్నాయి. కేవలం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఇన్ని పోస్టులు భర్తీ చేయించిన ఘనత వైఎస్‌ జగన్‌దే. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు.
 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top