ఉపాధ్యాయుల పదోన్నతులపై సర్కారు మౌనం | AP Govt silent on teachers promotions | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల పదోన్నతులపై సర్కారు మౌనం

Jul 3 2026 6:04 AM | Updated on Jul 3 2026 6:04 AM

AP Govt silent on teachers promotions

విద్యాశాఖను పట్టించుకోని మంత్రి లోకేశ్‌  

ఈ ఏడాది దాదాపు 5 వేలమందికి అన్యాయం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు సర్కారు మొండిచేయి చూపుతోంది. ఏటా పదోన్నతులు కల్పిస్తామని, బదిలీలు చేస్తామని చెప్పి తీసుకొచ్చిన చట్టాన్ని ఏడాదిలోనే అటకెక్కించింది. ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చిన తర్వాతే చట్టప్రకారం బదిలీలు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం సర్దుబాటు పేరుతో బదిలీలు చేస్తోంది. జిల్లాల పునరి్వభజన నేపథ్యంలో ఇతర అన్ని ప్రభుత్వశాఖల్లోనూ పదోన్నతులు కల్పిస్తుండగా.. విద్యాశాఖలో మాత్రం అలాంటి ప్రక్రియ ఏదీ చేపట్టకుండానే సర్దుబాటుకు తెరదీశారు.

గతేడాది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల రెగ్యులేషన్‌ చట్టం–2025 తెచ్చిన ప్రభుత్వం దాదాపు 68 వేలమందిని బదిలీ చేసింది. వీరిలో నాలుగువేల మందికి పదోన్నతులు కల్పించారు. 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభమై పక్షంరోజులు దాటినా పదోన్నతులపై విద్యాశాఖ మంత్రి లోకేశ్‌  చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  చట్టప్రకారం ఈ ఏడాది ఐదువేల నుంచి ఆరువేలమంది ఉపాధ్యాయులకు పదోన్నతులు రావాల్సి ఉంది. 

ఇందులో ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ వరకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఉమ్మడి జిల్లాలో దాదాపు 300 మంది చొప్పున మొత్తం 3,900 మంది ఉన్నారు. అలాగే స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి గ్రేడ్‌–2 హెడ్‌మాస్టర్లుగా మరో 800 మంది నుంచి 1,100 మంది ఉన్నట్టు అంచనా. పదోన్నతులు కల్పిస్తే ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులకు రెండు ఇంక్రిమెంట్లు వస్తాయని, తాజా పరిణామాలతో వారంతా నష్టపోతున్నారన్న ఆందోళన టీచర్లలో వ్యక్తమవుతోంది.  

సర్దుబాటుతోనే సరి..  
గత ఏడాది దాదాపు 48 మంది స్కూల్‌ అసిస్టెంట్లను సర్దుబాటు పేరుతో పీఎస్‌ హెచ్‌ఎంలుగా బదిలీ చేసినా.. వారికి హెచ్‌ఎంలుగా పదోన్నతులు ఇవ్వలేదు. అలాగే హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలల్లో దాదాపు 1,200 వరకు ఖాళీలున్నాయి. 1,136 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) పోస్టులు, 1,124 స్కూల్‌ అసిస్టెంట్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) పోస్టులను సృష్టించిన ప్రభుత్వం ఈ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు, అలాగే అర్హత గల వారికి పదోన్నతులు కూడా ఇవ్వలేదు. దీంతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement