‘గిరి’ రహదారులకు మోక్షం | Sakshi
Sakshi News home page

‘గిరి’ రహదారులకు మోక్షం

Published Wed, Jan 17 2024 3:52 AM

AP Govt Reconstructing Damaged Roads in Villages - Sakshi

మెళియాపుట్టి: ‘గిరి’ గ్రామాల రహదారుల కష్టాలకు ఎట్టకేలకు తెరపడింది.  శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలంలో ఉత్తరాంధ్రలోనే అత్యంత ఎత్తయిన గిరిజన గ్రామాలు ఉన్నాయి. వాటికి దశాబ్దాలుగా రహదారి సౌక­ర్యాలు లేవు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చా­క సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రెడ్డి శాంతి ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించి, గిరి శిఖర గ్రామాలను సందర్శించి వారి సమస్యలు, కష్టాలను తెలుసుకున్నారు.

రహదారి కష్టాలు తీరితే అన్ని సౌకర్యాలు వారికి అందుతాయనే ఆలోచన చేసి, విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగా ఉత్తరాంధ్రలోనే ఎత్తయిన గిరిశిఖర గ్రామ­మైన చందనగిరి గ్రామానికి (రూ.1.25 కోట్ల­తో 3.10 కి.మీ), హడ్డివాడ (రూ.1.75  కోట్లతో 2.3 కి.మీ), కేరాసింగి (రూ.92 లక్షలతో 1.5 కి.మీ), కేరాసింగిగూడ (రూ.1.5కోట్లతో 2.5 కి.మీ), మొత్తంగా రూ.5.42 కోట్లతో గిరి శిఖర గ్రామాలకు వెళ్లే రహదారి పనులకు నిధులు తీసుకువచ్చి పనులు సైతం వేగవంతం చేశారు.

ప్రస్తుతం హడ్డివాడ గ్రామానికి రహదారి పూర్తి కాగా.. మిగిలిన గ్రామాలకు రహదారి పనులు చివరి దశలో ఉన్నాయి. గిరిజనులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలోనే గౌరవం లభించిందని, పోడుపట్టాలు అందుకున్నామని, రైతుభరోసాతోపాటుగా అన్ని పథకాలు అందుతున్నాయని ఆయా గిరిజన గ్రామాల ప్రజలు చెబుతున్నారు. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ కొండలపైనుంచి కిందికి దిగి, రేషన్‌ సరుకులు మోసుకుంటూ వెళ్లిన రోజులు మర్చిపోయేలా చేసి కొండలపైకి నేడు ట్రాక్టర్‌పై సరుకులు తీసుకెళ్లి పంపిణీ చేస్తు­న్నారు. కొద్దిరోజుల్లోనే రహదారి నిర్మా­ణాలు పూర్తిచేసి గిరిజనుల కష్టాలకు తెరదించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. గత తెలుగుదేశం పాలకులు గిరిజనులకు చేసిందేమీ లేకపోవడంతో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలనను చూసి ఓర్వలేక విమర్శలకే పరిమితమయ్యారు.  

ఆనందంగా ఉంది
గడప గడపకూ వెళ్లిన సమయంలో రహదారులు చూసి బాధపడ్డాను. వారి గ్రామాలకు వెళ్లి కష్టాలను చూశాను. వారి బతుకులు బాగుచేయాలని ఆలోచించి జగనన్న దృష్టికి సమస్యను తీసుకువెళ్లాను. గిరిజనుల సమస్య అనగానే ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. రహదారుల మంజూరుతో ప్రస్తుతం గిరిజనుల కష్టాలు తీరనున్నందుకు సంతోషంగా ఉంది. ఎమ్మెల్యేగా వారికష్టాలు తీర్చడం చాలా ఆనందంగా ఉంది. గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేసిన వ్యక్తి జగనన్న కాబట్టే ఇది సాధ్యమైంది.
– రెడ్డి శాంతి, ఎమ్మెల్యే, పాతపట్నం 

మాటిచ్చారు.. నిలబెట్టుకున్నారు
రహదారి కోసం ఎన్నో ఏళ్లు నిరీక్షించాం. ఎంతో మంది చుట్టూ తిరిగాం. కానీ మా స్థితి మారలేదు. మహిళా ఎమ్మెల్యే అయినా.. రెడ్డి శాంతమ్మ కాలినడకన మా గ్రామానికి వచ్చి ‘గడప గడపకూ కార్యక్రమం’ నిర్వహించారు. మా సమస్యలు చెప్పుకొన్నాం. అన్నీ చేస్తానని మాటిచ్చారు. రహదారి మంజూరు చేశారు. రోడ్డు పూర్తి కావడంతో మాకష్టాలు తీరాయి. సంతోషంగా ఉంది.  – చందనగిరి పోలయ్య, హడ్డివాడ గ్రామం 

సంతోషంగా ఉంది
జగనన్నను పాదయాత్రలో కలిసి గిరిజ­నుల కష్టాలను వివరించాను. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాన్నారు. ఎమ్మెల్యే దృష్టికి గిరిజనుల సమస్యలు తీసుకెళ్లా.. ఆమె స్పందించారు. కృషికి ఫలి­తం లభించింది. ఎంతోకాలంగా  కొండప్రాంతాలకు సరైన రహ­దా­రులు లేక ఇబ్బందులు పడ్డాం. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మా గిరి­జనుల కష్టాలు తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జెడ్పీ­టీసీగానే కాకుండా నేను కూడా గిరిజనుల్లో ఒకడ్ని కావడం ఆనందం­గా ఉంది. సీఎం జగన్, ఎమ్మెల్యే రెడ్డి శాంతికి రుణపడి ఉంటాను.  –  గూడ ఎండయ్య, జెడ్పీటీసీ సభ్యుడు, మెళియాపుట్టి మండలం

Advertisement
 
Advertisement