పశువిజ్ఞాన బడితో పాడి సిరులు  

AP Govt Looks On Development Of Dairy Farmers - Sakshi

బుట్టాయగూడెం: అన్నదాతల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్న ప్రభుత్వం పాడి రైతుల అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది. రైతుల ముంగిటకు సేవలందించేందుకు ఆర్బీకేలు ఏర్పాటు చేసి ఇక్కడ రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించేలా ఏర్పాటు చేశారు. పాడి రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా కేంద్రాల్లోనే పశు విజ్ఞాన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీనిద్వారా పశు పోషణ, మెలకువలపై పశువైద్య సహాయకులు, గోపాల మిత్రలు రైతులకు పూర్తి అవగాహన కల్గిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పశు విజ్ఞాన బడి తమకు ఎంతగానో ఉపయోగ పడుతుందని పాడి రైతులు ఆనంద పడుతున్నారు. 

ఏలూరు జిల్లాలో 537 కేంద్రాలు 
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 911 రైతు భరోసా కేంద్రాల ద్వారా పశు విజ్ఞాన బడి కార్యక్రమం అమలు జరిగేలా అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతీ గ్రామ సచివాలయ పరిధిలో పాడి రైతులకు సలహాలు, పలు సూచనలు ఇచ్చేందుకు 373 మంది పశువైద్య సహాయకులు, 187 మంది గోపాల మిత్రల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని 28 మండలాల పరిధిలో ఉన్న 537 రైతు భరోసా కేంద్రాల్లో పశు విజ్ఞాన బడి కార్యక్రమం విజయవంతంగా అమలు జరిగేలా అధికారులు కృషి చేస్తున్నారు. 

పాడి పశువుల పెంపకంపై అవగాహన : ఆర్బీకేల్లో అమలు చేస్తున్న పశు విజ్ఞాన బడి కార్యక్రమం ద్వారా పాడి రైతులకు పాడి పెంపకంపై మెలకువలు, యాజమాన్య పద్ధతులు, పశువుల్లో వచ్చే సీజనల్‌ వ్యాధులపై అవగాహన కలిగిస్తున్నారు. పశువుల్లో వచ్చే వ్యాధులైన గొంతువాపు, జబ్బ వాపు, సంచుల వ్యాధి, గొర్రెలు, మేకలకు వచ్చే ఇటిక వ్యాధి గురించి అవగాహన కలిగిస్తున్నారు. జీవాలకు టీకాలు వేసే సమయం తదితర అన్ని వివరాలను పశువైద్య సహాయకులు వివరిస్తున్నారు. దగ్గర ఉండి పశువులకు టీకాలు వేయిస్తున్నారు. పశువుల కృత్రిమ గర్భధారణ గురించి పాడి రైతులకు అవగాహన కలిగిస్తున్నారు.  

పాడి రైతులకు రుణ సదుపాయం 
భవిష్యత్‌లో కిసాన్‌కార్డుల ద్వారా రైతులకు ఏ విధంగా రుణాలు ఇస్తారో అదేవిధంగా పాడి పెంపకం చేపట్టే రైతులకు కూడా కిసాన్‌ కార్డుల ద్వారా రుణాలు ఇవ్వనున్నారు. పశువుల దాణా, పశుగ్రాస విత్తనాలు కూడా పాడి రైతులకు అందిస్తున్నారు. ఇంతవరకూ ఏలూరు జిల్లాకు సంబంధించి 537 కేంద్రాల పరిధిలో 2142 మంది పాడి రైతులకు 705 టన్నుల దాణాను సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా 3725 మంది రైతులకు 58.4 టన్నుల పశుగ్రాస విత్తనాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. 

రైతు భరోసా కేంద్రంలో విజ్ఞాన బడి 
ఆర్బీకేల్లోనూ పశు రైతుల కోసం పశు విజ్ఞాన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. మేకల పెంపకం, గొర్రెలు, పోషకాలకు సంబంధించిన మెలకు వలు, పశువులకు వచ్చే వ్యాధుల నివారణ చర్యలను రైతులకు వివరిస్తున్నాం.  
– జి.నెహ్రూబాబు, పశు సంవర్ధక శాఖ జేడీ, ఏలూరు 

పశు విజ్ఞాన బడితో ప్రయోజనం 
రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పశు విజ్ఞాన బడి పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పశువులకు వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కలిగిస్తున్నారు. దీంతో సకా లంలో వైద్యం చేయించగలుగుతున్నాం. అలాగే పశు సంపద అభివృద్ధిపై మెలుకువలు కూడా చెబుతున్నారు. 
– కె.భూమయ్య, రైతు, బూరుగువాడ, బుట్టాయగూడెం మండలం  

పాడి రైతులకు ఎంతో మేలు  
రైతుభరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పశు విజ్ఞాన బడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయ పనులకే కాకుండా పాడి సంపదపై అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నాయి. ఈ ఆర్‌బీకేల్లో ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చే దాణాలు, మందులు, గడ్డి కోసే యంత్రాలు, పాలు పితికే యంత్రాలు మొదలైన వాటిని రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు.  
– డాక్టర్‌ ఎం.సాయి బుచ్చారావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏహెచ్‌), జీలుగుమిల్లి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top