‘శ్రీశైలం’లో నీటి నిల్వ సామర్థ్యం ఎంత? 

AP Govt has taken steps to ensure Srisailam has full water storage capacity - Sakshi

జలాశయంలో జియో సర్వీసెస్‌ సంస్థ బ్యాథమెట్రిక్‌ సర్వే  

నిర్మాణ సమయంలో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు 

పూడిక వల్ల 2001–02 నాటికి 264 టీఎంసీలకు తగ్గిన వైనం 

2009–10 నాటికి 215.81 టీఎంసీలకు తగ్గిన దుస్థితి 

తాజాగా నీటి నిల్వ సామర్థ్యాన్ని తేల్చేందుకు జల వనరుల శాఖ చర్యలు 

నదీ పరివాహకంలో తగ్గిన అటవీ విస్తీర్ణం.. భూమి కోత.. వీటివల్లే పూడిక  

సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యాన్ని తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జలాశయంలో డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (డీజీపీఎస్‌) విధానంలో బ్యాథమెట్రిక్‌ సర్వే చేయడం ద్వారా ఏ మట్టంలో.. ఎంత నీరు నిల్వ ఉంటుందన్నది తేల్చే పనులను ముంబైకి చెందిన ‘జియో సర్వీసెస్‌’ మారిటైమ్‌ లిమిటెడ్‌ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ శుక్రవారం సర్వే పనులు ప్రారంభించింది. జలాశయం జల విస్తరణ ప్రాంతం 616 చదరపు కిలోమీటర్లు. బెడ్‌ లెవల్‌ సగటున 500 మీటర్లు. పూర్తి నీటిమట్టం 885 అడుగులు.

జలాశయం జల విస్తరణ ప్రాంతంలో బెడ్‌ లెవల్‌ నుంచి 885 అడుగుల వరకు.. ఏ మట్టం వద్ద ఎంత నీరు నిల్వ ఉంటుదన్నది పడవల ద్వారా ఏడీసీపీ (అకౌస్టిక్‌ డాప్లర్‌ కరంట్‌ ప్రొఫైలర్‌) పరికరాన్ని ఉపయోగించి.. బ్యాథమెట్రిక్‌ సర్వే ద్వారా తేల్చుతామని హైడ్రాలజీ విభాగం సీఈ కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు. శ్రీశైలం జలాశయాన్ని నిర్మించినప్పుడు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు. 2001–02లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 264 టీఎంసీలేనని తన సర్వే ద్వారా తేల్చింది. 

భూమి కోతతో కొట్టుకొస్తున్న పూడిక 
నదీ పరివాహక ప్రాంతంలో అడవులను నరికేయడం వల్ల భూమి కోతకు గురై.. వరదతో పాటు మట్టి కొట్టుకొస్తోంది. అందువల్లే శ్రీశైలం జలాశయంలో పూడిక భారీ ఎత్తున పేరుకుపోతోంది. ఇందు వల్లే నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని సీడబ్ల్యూసీ తేల్చింది. 2009–10లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యంపై మరో సర్వే చేసింది. ఆ సర్వేలో నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు తగ్గిందని తేలింది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ప్రతి పదేళ్లకు ఒకసారి నీటి నిల్వ సామర్థ్యంపై సర్వే చేయాలి. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌పీ (నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టు)లో భాగంగా శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం తేల్చే పనులను జల వనరుల శాఖ అధికారులు చేపట్టారు. తాజాగా చేపట్టిన సర్వే 15 రోజుల్లో పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top