Andhra Pradesh: ఆ వైద్యుడి చికిత్స ఖర్చు ప్రభుత్వానిదే..!

AP Govt has stepped in to cover cost of treatment covid effected doctor - Sakshi

కోవిడ్‌ బాధితులకు అలుపెరుగని సేవలందించిన వైద్యుడు

మహమ్మారి బారినపడి ఆస్పత్రి పాలు

ఊపిరితిత్తులు మార్చకుంటే ప్రాణాపాయం

రూ. 1.50 కోట్లు ఖర్చవుతుందన్న వైద్యులు

ప్రభుత్వమే భరించేలా సీఎం ఆదేశాలిచ్చారన్న మంత్రి బాలినేని

ఒంగోలు/కవిటి:  కోవిడ్‌ బాధితులకు అలుపెరగని సేవలందించిన ప్రభుత్వ వైద్యుడు కరోనా బారిన పడి ఆస్పత్రి పాలవగా.. ఆయన చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపుట్టుగకు చెందిన డాక్టర్‌ ఎన్‌.భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలతో సుమారు 6 వేల మందికి కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా తేలిన వారెందరికో అండగా నిలబడ్డారు. ఆయన అందించిన వైద్యంతో వేలాది మంది కోవిడ్‌ బారినుంచి బయటపడ్డారు. ఏప్రిల్‌ 24న ఆయనకు కరోనా సోకింది. నెలాఖరు వరకు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి వైద్యం పొందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో భార్య డాక్టర్‌ భాగ్యలక్ష్మి ఆయనను విజయవాడ ఆయుష్‌ ఆస్పత్రిలో చేర్చారు.

అక్కడ 10 రోజుల వైద్యం తరువాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ యశోదా హాస్పిటల్, తరువాత గచ్చిబౌలిలోని కేర్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడవటంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుండటంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఆయనకు ఊపిరితిత్తులు మార్చాలని తేల్చిన వైద్యులు అందుకు రూ.1.50 కోట్లకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో డాక్టర్‌ భాస్కరరావు కుటుంబ సభ్యులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించారు. బాలినేని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి అతడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.కోటి వెంటనే చెల్లించాలని, అవసరమైతే మరో రూ.50 లక్షలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారని మంత్రి బాలినేని తెలిపారు. 

చదవండి: సకల సౌకర్యాలతో జర్మన్‌ హ్యాంగర్‌ ఆస్పత్రి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top