Andhra Pradesh: వేగంగా ‘ప్రాధాన్యత’ పనులు 

AP Govt Green Signal For Priority Works - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు గుర్తించిన ప్రాధాన్యత పనులు వేగంగా జరుగుతున్నాయి. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతి సచివాలయం పరిధిలో అత్యంత ప్రాధాన్యత గల పనులను గుర్తించి, ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఇలా అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన రూ.1,002.34 కోట్ల విలువైన 25,934 పనులను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. వీటిలో ఇప్పటివరకు రూ.922.88 కోట్ల విలువైన 23,845 పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇందులో రూ.758 కోట్లకు పైగా విలువైన 20,408 పనులు ప్రారంభం కాగా, రూ.32.15 కోట్ల విలువైన 813 పనులను పూర్తి చేశారు. రాష్ట్రంలో మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ నెల 2వ తేదీ వరకు 5,173 సచివాలయాలను మంత్రులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. వాటి పరిధిలో ప్రజలకు అవసరమైన అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత పనులను గుర్తించి, వాటి వివరాలను గడప గడపకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత పనుల పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

ఇలా అప్‌లోడ్‌ చేసిన పనులను వెంటనే మంజూరు చేయడం, వాటిని ప్రారంభించడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఒక్కో సచివాలయం పరిధిలోని పనులకు రూ.20 లక్షల చొప్పున రూ.3,000 కోట్లు మంజూరు చేయడమే కాకుండా, పూర్తయిన పనుల బిల్లుల చెల్లింపునకు తొలి విడతగా రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను డీడీవోలకు పంపింది. ఈ పనుల పురోగతిని కూడా ఎప్పటికప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత పనుల పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పూర్తయిన పనుల బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసి నిబంధనల ప్రకారం చెల్లించాలని డీడీవోలను ఆదేశించింది. పనుల పురోగతి, బిల్లుల చెల్లింపులను  ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top