ఏపీ: కోల్డ్‌వేవ్‌తో జనం గజగజ.. విశాఖ ఏజెన్సీ చరిత్రలోనే తొలిసారిగా..!

AP Coolest Place Araku Chintapalle Records Lowest Temperature - Sakshi

దేశం వ్యాప్తంగా కోల్డ్‌వేవ్‌ ప్రభావం కనిపిస్తోంది.  చలి దెబ్బకు తెలుగు రాష్ట్రాలు గజగజలాడిపోతున్నాయి. ఏపీలోనూ చలి పంజా విసురుతోంది.  మొదటిసారిగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో మునుపెన్నడూ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మరో 3 రోజులు ఇదే తీవ్రతతో పరిస్థితి కొనసాగవచ్చని, చిన్నపిల్లలు.. వృద్ధులు.. శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న వాళ్లు  అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. 

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా) : చలి పులి పంజాకు రాష్ట్రం గజగజా వణికిపోతోంది. కోల్డ్‌ వేవ్‌ ప్రభావం రాష్ట్రాన్ని తాకడంతో మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి గాలుల తీవ్రత పెరిగింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపో­యా­యి. అక్కడ సాధారణం కంటె 3 నుంచి 5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి.

అల్లూరి సీతా­రామరాజు జిల్లాలో ఆంధ్రా కశ్మీర్‌గా అభివర్ణించే ‘చింతపల్లి’తో పాటు హుకుంపేట, జి.మాడు­గుల మండలం కుంతలం, గూడెం కొత్తవీధి మండలం జీకే వీధిలో అత్యల్పంగా 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోద­య్యాయి. అంతకు ముందు ఆ రికార్డు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌గా ఉండేది!. డుంబ్రిగూడ మండల కేంద్రం, పెదబయలు మండలం గంపరాయిలో 2.6, హుకుంపేట మండలం కొక్కిసలో 2.7, ముంచంగిపుట్టు మండలం గొర్రెలమెట్టలో 2.8, పెదబయలులో 2.9, పాడేరులో 3.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఇక్కడ అత్యల్పంగా 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమో­దైంది. తొలిసారిగా ఇప్పుడు 1.5 డిగ్రీలకు పడిపో­వడంతో ప్రజలు, పర్యాటకులు ఆశ్చర్యపో­తు­న్నా­రు. బయటకు రావ­డానికే బెంబేలెత్తిపో­తున్నా­రు.

అరకు తదితర ప్రాంతాల్లోనూ పలుచోట్ల కనిష్ట ఉష్ణో­గ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. విజయ­వాడలో ఆదివారం ఉదయం 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రాన్నీ కోల్డ్‌వేవ్‌ తాకినట్టే.. ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో కోల్డ్‌ వేవ్‌ ప్రభావం ఉంటుందని ప్రకటించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 5 నుంచి 6 డిగ్రీలు పడిపోతే కోల్డ్‌ వేవ్‌గా పరిగణిస్తారు.

ఆంధ్రా ఊటీగా పేరున్న అరకు ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో 3 నుంచి 5 డిగ్రీలు పడిపోయాయి. దీంతో కోల్డ్‌ వేవ్‌ మన రాష్ట్రాన్ని తాకినట్లే వాతావరణ శాఖాధికారులు చెబుతున్నా­రు. బంగ్లాదేశ్‌లో ఉన్న అప్పర్‌ ఎయిర్‌ సర్క్యు­లేషన్‌(వాతావరణంలోని ఎత్తయిన ప్రదేశాల్లో వీచే గాలులు), పశ్చిమ గాలుల ప్రభావంతో కోల్డ్‌వేవ్‌ కొనసాగుతోంది. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. మరీ ముఖ్యంగా అల్లూరి సీతారా­మరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, పశ్చిమ­గోదావరి, విశాఖ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top