ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

AP Cabinet Key Decisions On Today Meeting - Sakshi

సాక్షి, విజయవాడ: మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో.. రూ.5,835 కోట్లతో 36 నెలల్లో పోర్టు నిర్మాణం పూర్తయ్యేందుకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్‌..  చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే ‘జగనన్న చేదోడు’ పథకానికి ఆమోదం తెలిపింది. అదే విధంగా రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రాజెక్టు, కొత్త ఇసుక పాలసీని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక విజయనగరం జిల్లా గాజులరేగలో.. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాలు, పాడేరు మెడికల్ కాలేజీకి 35 ఎకరాల భూమి కేటాయింపునకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఉచిత నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై కూడా ఈ సందర్భంగా చర్చించింది. కాగా భేటీ అనంతరం వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.(చదవండి: పండుగలా ప్రజా చైతన్య కార్యక్రమాలు )

కఠిన చర్యలు తప్పవు
కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక ప్రకారం నూతన ఇసుక విధానం ఉంటుందని పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలకై ప్రభుత్వ సంస్థలకే తొలి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వ సంస్థలు ముందుకు రానిపక్షంలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా ఇసుక బుక్‌ చేసుకోవచ్చని, వినియోగదారులు సొంత వాహనాల్లో నేరుగా ఇసుక రీచ్‌ నుంచే ఇసుక తీసుకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ ధరల కంటే ఎక్కువ రేట్లకు ఇసుక అమ్మితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇసుక ధరలపై ప్రజలు ఎస్‌ఈబీకి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ‘‘ఎస్‌ఈబీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాం. ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఈబీకి అనుసంధానం. ఎస్‌ఈబీ పరిధిలోకి గుట్కా, జూదం, మత్తు పదార్ధాలు తీసుకువస్తాం’’ అని మంత్రి పేర్కొన్నారు. 

  • నవంబర్ 24న జగనన్న చేదోడు పథకం ప్రారంభం
  • జనవరి 1 నుంచి ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరా
  • ప్రతీ బియ్యం బస్తాపై క్యూఆర్ కోడ్
  • బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు వాహనాలకు జీపీఎస్‌ అనుసంధానం
  • పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేస్తాం
  • మహిళా పాల ఉత్పత్తి సంఘాల ద్వారా పాల సేకరణ
  • గ్రామాల్లో బల్క్‌ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top