పోలవరం అంటే వైఎస్‌ఆర్‌.. పూర్తి చేసేది నేనే..  ప్రాజెక్టును ఏటీఎంలా చంద్రబాబు వాడుకున్నాడు

AP Assembly Budget Session 2023: CM YS Jagan Speech On Polavaram - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు చంద్రబాబు నోటివెంట పోలవరం పేరు ఒక్కసారైన రాలేదని, ప్రాజెక్టు కోసం ఆయన చేసింది ఏమీ లేదని, అసలు పోలవరం అనే పేరు పలికే అర్హత బాబుకు లేదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. గురువారం పోలవరంపై చర్చ జరిగింది.  ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 

పోలవరంపై ఎల్లో మీడియాలో కథనాలు చూశాను. అవన్నీ అసత్య కథనాలు. పోలవరం పనులు చంద్రబాబే చేశారంటూ అభూత కల్పనలతో ఎల్లో మీడియా వార్తలు రాసింది.  గోబెల్స్‌ ప్రచారం చేయడంలో బాబు సిద్ధహస్తుడు. అసలు పోలవరం అనే పదాన్ని పలికే అర్హత బాబుకు ఉందా? అని సీఎం జగన్‌ అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు. 

సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు?. 1995 నుంచి 2014 వరకు చంద్రబాబు నోటి వెంట పోలవరం అనే పేరు ఒక్కసారైనా రాలేదు. పైగా టీడీపీ హయాంలో పోలవరం నిధులను యథేచ్చగా దోచేశారు. టీడీపీ హయాంలో ఎక్కువగా డబ్బు వచ్చే పనులను ముందు చేశారు. తక్కువ డబ్బులు వచ్చే పనుల్ని తర్వాత చేపట్టారు. స్పిల్‌ వే పనుల్ని అసంపూర్ణంగా పునాదుల స్థాయిలోనే వదిలేసి.. కాఫర్‌ డ్యాం పనుల్ని మొదలుపెట్టారు. కాఫర్‌ డ్యామ్‌లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అప్రోచ్‌ చానల్‌ పనులు కూడా జరగలేదు. అసలు స్పిల్‌ వే పూర్తి కాకుండా కాఫర్‌ డ్యాం పనుల్ని ఎలా పూర్తి చేస్తారు?. అసలు బుద్ధి ఉన్నవాళ్లెవరైనా ఇలా చేస్తారా?. టీడీపీ అనాలోచిత నిర్ణయం వల్ల డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందని సీఎం జగన్‌ గుర్తు చేశారు.  

ఇదీ టీడీపీ పోలవరం ఇంజనీరింగ్‌ విధానం.వాళ్ల ధ్యాస అంతా డబ్బు స్వాహా పైనే పెట్టారు. చంద్రబాబుకు పోలవరం ఏటీఎం అని స్వయంగా ప్రధాని మోదీనే చెప్పారు. అయినా సరే యెల్లో మీడియా పనులు ఆయనే చేశారంటూ తప్పుడు కథనాలు రాస్తోంది. వాటిని ఎవరూ నమ్మొద్దు. టీడీపీ హయాంలో పోలవరం నిర్మాణం ఒక్క అడుగైనా జరిగిందా? అని ప్రశ్నించారాయన.  చంద్రబాబు, దత్తపుత్రుడు సహా ఎల్లో మీడియాకు పోలవరం పేరు పలికే అర్హత లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. 

పోలవరం కలల ప్రాజెక్టు అని దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ చెప్పారు. పోలవరాన్ని ప్రారంభించింది మా నాన్నే వైఎస్‌ఆరే.. పూర్తి చేసేది ఆయన కుమారుడైన నేనే(సీఎం జగన్‌ తనను తాను ఉద్దేశిస్తూ..) అని ఉద్ఘాటించారు సీఎం జగన్‌. అసలు పోలవరం అంటే వైఎస్‌ఆర్‌.. వైఎస్‌ఆర్‌ అంటే పోలవరం అని పేర్కొన్నారాయన. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ. 800 కోట్లు ఆదా చేశామని తెలిపిన సీఎం జగన్‌.. తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే స్పిల్‌ వే.. అప్పర్‌ కాఫర్‌ డ్యాం పూర్తయ్యిందని తెలిపారాయన.

ప్రస్తుతం గోదావరి డెల్టాకు నీరు అందించే పరిస్థితి ఉందని సీఎం జగన్‌ అసెంబ్లీలో ప్రకటించారు. స్పిల్‌వే పూర్తి చేసి 48 గేట్లు పూర్తి చేశాం. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు పూర్తి చేశాం. గోదావరిలో భారీ స్థాయిలో వరద వచ్చినా.. స్పిల్‌వే ద్వారా వరదను నియంత్రించగలిగామని అసెంబ్లీలో ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top