ఆళ్లగడ్డలో ఆగని చికెన్‌ దందా! | Animal Husbandry and Municipal officials went to inspect chickens in Allagadda | Sakshi
Sakshi News home page

ఆళ్లగడ్డలో ఆగని చికెన్‌ దందా!

Jun 7 2025 2:58 AM | Updated on Jun 7 2025 3:00 AM

Animal Husbandry and Municipal officials went to inspect chickens in Allagadda

కోళ్లను పరీక్షించాలని వెళ్లిన పశుసంవర్థక, మున్సిపల్‌ అధికారులు  

పురుగుల మందు తీసుకుని ఆత్మహత్య చేసుకుంటామని నిర్వాహకుల నిరసన 

పారిపోయిన అధికారులు  

ఆళ్లగడ్డ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చికెన్‌ అంగళ్ల నిర్వాహకులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మాట వినని వారిని ఎలాగైనా బెదిరించి లొంగదీసుకునేందుకు చేయని ప్రయత్నంలేదు. తాజాగా.. శుక్రవారం కొందరు అధికారులు చికెన్‌ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలకు వెళ్లగా అందరూ తిరగబడటంతో అధికారులు వెనుదిరిగిన ఘటన ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ పట్టణంలో కప్పం కట్టేందుకు ససేమిరా అంటున్న కొన్ని చికెన్‌ అంగళ్లపై టీడీపీ నేతలు అధికారులను ప్రయోగించారు.  

అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు మున్సిపల్‌ అధికారులు, పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి చికెన్‌ సెంటర్ల దగ్గరకు వెళ్లి ‘మీ దుకాణంలో ఉన్న చికెన్‌ తింటుంటే రోగాలు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చినందున కోళ్లను, చికెన్‌ను పరీక్షించేందుకు వచ్చాం’ అని చెప్పారు. ఈ విషయం మరికొంతమంది చికెన్‌ సెంటర్ల నిర్వాహకులకు తెలియడంతో అందురూ అక్కడికొచ్చి.. ‘40 ఏళ్లకు పైగా చికెన్‌ వ్యాపారం చేస్తున్నాం.. ఎప్పుడూలేనిది ఇప్పుడెందుకు వచ్చింద’ని అధికారులతో వాగ్వాదానికి దిగారు. 

‘ఎవరు పంపితే మీరు వచ్చారో మాకు తెలుసు, మా దగ్గర ఉన్న చికెన్‌ వండి పెడతాం.. మా కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు ఎంతమందైనా తినండి. ఉదయం వారికి అస్వస్థత వస్తే మాపై చర్యలు తీసుకోండి. అంతేగానీ, ఈరోజు శాంపిల్‌గా చికెన్‌ తీసుకుపోయి రెండ్రోజుల తరువాత పరీక్షించి పాడైపోయిన చికెన్‌ అంటే ఎలా కుదురుతుంద’ని నిలదీశారు. 

అయినా, అధికారులు శాంపిల్‌ తీసుకెళ్తామనడంతో అందరు ఒక్కసారిగా పురుగు మందు డబ్బాలు పట్టుకుని మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిండంతో అధికారులు అక్కడి నుంచి పారిపోయారు. ఇంతవరకు రాజకీయ వేధింపులే అనుకుంటే.. ఇప్పుడు అధికారులు సైతం కిలోకు రూ.5 ఇవ్వండి అధికారులు అందరం పంచుకుంటామని బెదిరిస్తున్నారని చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. 

చాగలమర్రి చికెన్‌ సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు.. 
ఇక ఇంతవరకు ఆళ్లగడ్డ పట్టణానికే పరిమితమైన ఈ వేధింపుల పర్వం తాజాగా చాగలమర్రికీ చేరుకుంది. శుక్రవారం ఇక్కడ ఎనిమిది చికెన్‌ సెంటర్లకు పంచాయతీ అధికారులు నోటీసులిచ్చారు. లైసెన్స్‌లేని కారణంగా మీ సెంటర్లను సీజ్‌ చేస్తామని నోటీసులివ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది. 

దీనిపై ఈఓపీఆర్డీ తహీర్‌ హుస్సేన్‌ వివరణ కోరగా.. లైసెన్స్‌ లేకుండా మండలంలో ఎవరూ చికెన్‌ అమ్మకూడదని.. ప్రస్తుతం ఫిర్యాదు వచ్చిన కొన్ని సెంటర్లకు నోటీసులిచ్చామని మున్ముందు గ్రామాల్లో సైతం చికెన్‌ వ్యాపారం నిర్వహించుకునే వారందరికీ నోటీసులు ఇస్తామన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement