పోలవరం నిర్వాసితులకు వేగంగా పునరావాసం

Anilkumar Yadav Mandate Rapid rehabilitation for Polavaram expats - Sakshi

 అధికారులకు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆదేశం 

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆదేశించారు. మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆయన సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కుడి వైపున 96 మీటర్ల డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించే పనులు చేపట్టామని, నెలాఖరులోగా రక్షిత స్థాయికి దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఆలోగా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు పూర్తవుతాయని మంత్రికి వివరించారు.

ఆ తర్వాత రెండు కాఫర్‌ డ్యామ్‌ల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడివేసి.. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్పీ) సూచనల మేరకు ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనులు చేపట్టి..2022 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి అనిల్‌కుమార్‌..గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెలలో 5 వేల నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని అధికారులు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాలో తాడ్వాయిలో పునరావాస కాలనీ నిర్మాణంలో జాప్యం జరుగుతుండటంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణమే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్‌ పనులను వేగవంతం చేసి.. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top