ఆనందయ్య వ్యాజ్యం ధర్మాసనానికి

Andhra Pradesh High Court Single Judge Orders on Anandaiah Pil - Sakshi

హైకోర్టు సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: కరోనా చికిత్సలో భాగంగా తాను తయారు చేసిన ఔషధాన్ని తీసుకునేందుకు తన ఇంటికి వస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారని, తన ఔషధ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య దాఖలు చేసిన వ్యాజ్యం ధర్మాసనానికి బదిలీ అయింది. ఆనందయ్య ఔషధం వ్యవహారంపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంపైన కూడా ధర్మాసనమే విచారణ జరపడం మేలని సింగిల్‌ జడ్జి జస్టిస్‌ దొనడి రమేశ్‌ అభిప్రాయపడ్డారు.

ఆనందయ్య వ్యాజ్యాన్ని ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అంతకుముందు ఆనందయ్య న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. గతంలో కూడా హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందామని, ఆ తరువాత పోలీసుల జోక్యం తగ్గిందని చెప్పారు. ఇప్పుడు కూడా పోలీసులు ఔషధం పంపిణీ విషయంలో జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. ఔషధం కోసం వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్నారని వివరించారు.

ఈ వాదనలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ తోసిపుచ్చారు. ఔషధం కోసం వచ్చే వారి వల్ల గ్రామంలో కోవిడ్‌ వ్యాప్తి చెందుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఆనందయ్య మందు పంపిణీ చేయవద్దంటూ గ్రామస్తులందరూ తీర్మానం చేశారని తెలిపారు. పోలీసులకు సైతం గ్రామ ప్రజల నుంచి వినతి వచ్చిందన్నారు. ఆనందయ్య రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ కాదని చెప్పారు. ఆనందయ్య మందుపై గతంలో ధర్మాసనం విచారణ జరిపిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం ముందుంచేందుకు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top