వారి పాత్ర లేకపోతే ‘లుక్‌ఔట్‌’ ఎందుకు?

Andhra Pradesh High Court On Look out circular - Sakshi

పోలీసుల తీరును తప్పు పట్టిన హైకోర్టు

సాక్షి, అమరావతి: నేరంలో నిందితుల పాత్ర లేదంటూ చార్జిషీట్‌ దాఖలు చేసిన తరువాత కూడా ఆ నిందితులపై లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌వోసీ)ను కొనసాగించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన దంపతులపై గతంలో జారీ చేసిన ఎల్‌వోసీ కొనసాగించడంపై పోలీసుల తీరును తప్పుపట్టింది. వెంటనే వారిపై ఎల్‌వోసీ ఉపసంహరించాలని ఆదేశించింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఇటీవల తీర్పు వెలువరించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్త, వైద్యులైన తన అడపడుచు, ఆమె భర్త తదితరులపై వరకట్న వేధింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారందరినీ నిందితులుగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆడపడుచు, ఆమె భర్తపై పోలీసులు ఎల్‌వోసీ జారీ చేశారు.

ఆ తరువాత వరకట్న వేధింపుల వ్యవహారంలో ఆడపడుచు, ఆమె భర్తకు ఎలాంటి సంబంధం లేదంటూ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు వారిద్దరికీ క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆడపడుచు, ఆమె భర్త ఉన్నత చదువుల కోసం విదేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఇమ్మిగ్రేషన్‌ అధికారి వారిని విదేశానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు.

వారిపై ఎల్‌వోసీ ఉందని, అందువల్ల విదేశీ ప్రయాణానికి అనుమతించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీంతో ఆ దంపతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ దుర్గాప్రసాద్‌ వారిపై జారీ చేసిన ఎల్‌వోసీ ఉపసంహరించాలని పోలీసులను, విదేశం వెళ్లేందుకు అనుమతించాలని ఇమ్మిగ్రేషన్‌ అధికారిని ఆదేశించారు. కేసు విచారణకు సంబంధించి ఎప్పుడు కోర్టు ఆదేశిస్తే అప్పుడు స్వయంగా హాజరయ్యేలా కింది కోర్టులో హామీ ఇచ్చి, రూ.2.50 లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని పిటిషనర్లను న్యాయమూర్తి ఆదేశించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top