పదవీ విరమణ వయసు పెంపు సాధ్యం కాదు

న్యాయాధికారుల రిటైర్మెంట్ వయసుపై హైకోర్టు ధర్మాసనం తీర్పు
రాజ్యాంగం ప్రకారం హైకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లు
న్యాయాధికారుల రిటైర్మెంట్ వయస్సు వారితో సమానంగా ఉండటానికి వీల్లేదు
ఇందుకు రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవు
పదవీ విరమణ వయస్సు పెంపుపై నిర్ణయాధికారం ఫుల్‌కోర్టుకు లేదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం సాధ్యం కాదని హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలని, న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు దీనితో సమానంగా ఉండటానికి రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేసింది.
ఈ తేడా సహేతుకమైనదేనని, దీనిని అలాగే కొనసాగించాలని ఆల్ ఇండియా జడ్జిల అసోసియేషన్ కేసులో సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది. న్యాయాధికారుల రిటైర్మెంట్ వయస్సు పెంపుపై ఫుల్ కోర్టు (పాలనాపరమైన నిర్ణయాల కోసం హైకోర్టు న్యాయమూర్తులందరు సమావేశమవడం) నిర్ణయం తీసుకోజాలదని తేల్చి చెప్పింది.
ఆ నిర్ణయాధికారం ఫుల్‌కోర్టుకు లేదని, అలా చేయడం సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమించడమే అవుతుందని స్పష్టం చేసింది. పైపెచ్చు ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టంలోని సెక్షన్ 3(1ఏ) ప్రకారం న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లుగానే ఉందని, దానిని సవరించనప్పుడు 62 ఏళ్లకు పెంచడం సాధ్యం కాదంది.
ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. విశ్రాంత న్యాయాధికారి కె.సుధామణి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
విజయనగరం జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న కె.సుధామణి వయసు 60 ఏళ్లకు చేరుకోవడంతో ఆమెకు పదవీ విరమణ వర్తింపజేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ సుధామణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయాధికారుల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని కోరారు.
ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జె. సుధీర్ వాదనలు వినిపించారు. హైకోర్టు తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు.