ఏపీ విద్యా వ్యవస్థ భేష్‌

Andhra Pradesh Education System Is Too Good - Sakshi

ప్రశంసించిన అస్సాం బృందం

నాడు– నేడు పనుల పరిశీలన

కంకిపాడు/సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న  విద్యా పథకాలు స్ఫూర్తిదాయకమని అస్సాం సమగ్ర శిక్ష మిషన్‌ డైరెక్టర్, విద్యాశాఖ కార్యదర్శి రోషిణీ అపరంజి కొరాటి ప్రశంసించారు. పునాదిపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, కంకిపాడు, కోలవెన్ను మండల పరిషత్‌ ఆదర్శ పాఠశాలలను రోషిణీ అపరంజి కొరాటి, అస్సాం రాష్ట్ర ఎలిమెంటరీ విద్య డైరెక్టర్‌ డాక్టర్‌ బిజోయా, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ డాక్టర్‌ నీరదా దేవి, సమగ్రశిక్ష రాష్ట్ర కన్సల్టెంట్‌ ముజఫర్‌ అలీతో కూడిన బృందం గురువారం సందర్శించింది. పునాదిపాడు పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో రోషిణీ అపరంజి కొరాటి మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత బాగుందన్నారు.

కోవిడ్‌ ప్రభావంతో పాఠశాలలు తెరవడం ఆలస్యం అయినా పాఠశాలల ప్రాంగణం, నిర్వహణ తీరు ఆహ్లాదకరంగా ఉందన్నారు. సీఎం వైఎస్‌జగన్‌ విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. సమగ్రశిక్ష రాష్ట్ర అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఒక్కో పాఠశాలకు రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.కోటి వరకు వెచ్చించి పాఠశాలల అభివృద్ధి కి కేటాయించారన్నారు. జగనన్న గోరుముద్దతో విద్యార్థులకు రుచికరమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్న విధానాన్ని అస్సాం బృందానికి వివరించారు. డీఈవో తహేరా సుల్తానా, సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ ఎ.శేఖర్, విజయవాడ డీవైఈవో రవికుమార్, మధ్యాహ్న భోజన పథకం ఏడీ వేణుగోపాలరావు, ఏఎంవో రాంబాబు, సీఎంవో ఎల్‌.వెంకటేశ్వరరావు, ఎంఈవో కనకమహాలక్ష్మి పాల్గొన్నారు. 

రాష్ట్ర విద్యాశాఖాధికారులతో భేటీ
రాష్ట్రంలోని విద్యా పథకాల అమలు తీరును పరిశీలించేందుకు వచ్చిన అస్సాం బృందం సమగ్ర శిక్ష కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యింది. అంతకుముందు బృంద సభ్యులు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు కూడా రాష్ట్ర విద్యావ్యవస్థను పరిశీలించిన విషయం విదితమే. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top