కన్నీటి కాష్టం.. చితికిన గుండెలు | Andhra Pradesh: 14 dead in Markapuram road accident | Sakshi
Sakshi News home page

కన్నీటి కాష్టం.. చితికిన గుండెలు

Mar 27 2026 6:02 AM | Updated on Mar 27 2026 7:38 AM

Andhra Pradesh: 14 dead in Markapuram road accident

ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ

బతుకు పయనంలో సమిధలు

ఎక్కువ మంది బేల్దారి కూలీలే

గుండెలను మెలిపెట్టే కథలే అన్నీ

నిశీధిలో మృత్యువు విసిరిన అగ్నిపాశం.. దావానలమై కబళించింది. నిలువెల్లా దహించింది. కన్నీటి కాష్టాన్ని మిగిల్చింది. గుండెలను చిదిమేసింది. మార్కాపురం బస్సు దహనం ఘటనలో మృతుల కుటుంబాలది ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ. బతుకుదెరువు కోసం ఊరికాని ఊరు వెళ్లి తిరుగు పయనంలో సమిథలైన వారి నేపథ్యాన్ని చూస్తే ప్రతి హృదయం కదిలిపోతోంది. పొంగుకొస్తున్న దుఃఖంతో విలవిల్లాడుతోంది. – కనిగిరి రూరల్‌/పామూరు/మార్కాపురం/ పొదిలి/దరి్శ/కొనకనవిుట్ల/కంభం/ఉదయగిరి

పండుగ చేద్దాం.. ఊరికొస్తున్నానని చెప్పి..
కనిగిరికి చెందిన దేవెండ్ల రామయ్య (51) 20 ఏళ్ల క్రితం బేల్దారి పనులకు తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌ వెళ్లాడు. ఆయన తల్లి ఉండడంతో ఏటా శ్రీరామనవవిుకి సొంతూరు వస్తాడు. ఈ ఏడాదీ బస్సులో బయలుదేరాడు.  బుధవారం మధ్యాహ్నం స్వగ్రామంలో ఉంటున్న అమ్మ వెంకటమ్మతో ఫోన్‌లో మాట్లాడాడు. వస్తున్నాను. పండగ చేద్దాం అన్నాడు. అంతలోనే ప్రమాదంలో మరణించాడు. కొడుకు మరణ వార్త విని తల్లి కన్నీరుమున్నీరవుతోంది.  

అమ్మమ్మ కోసం వెనక్కివెళ్లి..
ఎగసిపడుతున్న మంటలను దాటుకుని బతుకుజీవుడా అంటూ భర్త చేయిపట్టుకుని బస్సు దిగబోతున్న నిండు గర్భిణి తన అమ్మమ్మ ఆర్తనాదాలు విని చలించిపోయింది. భర్త వద్దని వారిస్తున్నా.. వినకుండా ఆమెను కాపాడేందుకు వెనక్కివెళ్లి ఆమెతోపాటే సజీవదహనమైపోయింది. కనిగిరి మండలం చల్లగిరిగిల గ్రామానికి చెదిన తమ్మిశెట్టి రుక్మిణి, బత్తుల లక్ష్మీ కుమారి వరుసకు అక్కా చెల్లెళ్లు. కనిగిరి పట్టణంలోని కొత్తపేటలో ఉంటూ బతుకు దెరువు కోసం తెలంగాణ రాష్ట్రం బడా బింగల్‌లో బేల్దారి పని చేసుకుంటున్నారు.

లక్ష్మీ కుమారి, ఆమె కుమార్తె మౌనికతోపాటు తమ్మిశెట్టి రుక్మిణి (26), ఆమె భర్త తిరుపాలు, రుక్మిణి అమ్మమ్మ పిచ్చమ్మ (80) కలిసి బస్సులో సొంతూరు బయలుదేరారు. తెల్లవారు జామున బస్సులో మంటలు ఎగిసిపడడంతో మెలకువగానే ఉన్న మౌనిక అందరినీ అప్రమత్తం చేసింది. మౌనిక, ఆమె తల్లి లక్ష్మీకుమారి స్వల్ప గాయాలతో బయట పడ్డారు.  తిరుపాలు భార్య రుక్మిణి చేయి పట్టుకుని బస్సు గేటు వరకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మంటల్లో చిక్కుకున్న పిచ్చమ్మ కేకలు వేయడంతో రుక్మిణి భర్త చేతిని విదిలించుకుని బస్సు లోపలికి వెళ్లింది.

మంటలు మరింత ఉద్ధృతం కావడంతో ఇద్దరూ సజీవదహనం అయ్యారు. వారిని కాపాడబోయిన తిరుపాలుకూ తీవ్ర గాయాలయ్యాయి.  ప్రస్తుతం అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు తరలించారు. రుక్మిణి పెళ్లైన ఐదేళ్ల తర్వాత గర్భిణి అయిందని, డాక్టరుకు చూపించుకుందామని సొంతూరుకు వస్తుండగా ఈ ఘోరం జరిగిపోయిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

 

కొడుకును కాపాడి.. కడతేరిన తల్లి 
కనిగిరి మండలంలోని మండాదివారిపల్లి గ్రామానికి చెందిన ఉప్పు రమాదేవి (45), భర్త మాల్యాద్రి, కుమారుడు మనోహర్‌ బేల్దారి పనులు నిమిత్తం తెలంగాణ రాష్ట్రం కోరుట్ల సమీపంలోని రామరాజుపల్లి గ్రామంలో ఉంటున్నారు. రమాదేవి, మనోహర్‌ శ్రీరామనవమి పండగ కోసం సొంతూరు బయలుదేరారు. తెల్లవారుజామున బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వెనుక సీట్లో కూర్చున్న వీరు బయటకు వచ్చేందుకు యత్నించారు. రమాదేవి కొడుకును కాపాడేందుకు మనోహర్‌ను కిటికీలో నుంచి బయటకు నెట్టింది. దీంతో మనోహర్‌ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. రమాదేవి మాత్రం మంటల్లో చిక్కుకుని సజీవదహనమైంది. కళ్లముందే తల్లి అగ్నికి ఆహుతి కావడంతో కొడుకు తల్లడిల్లిపోయాడు.  

మొక్కు తీర్చుకుందామనుకుంటే..   
కనిగిరి నియోజకవర్గంలోని వెలిగండ్ల మండలం చౌడవరానికి చెందిన పొదిలి మహేంద్ర బేల్దారి పనుల నిమిత్తం తెలంగాణకు వెళ్లాడు. శ్రీరామనవమి పండగకు గ్రామంలో మొక్కు తీర్చుకోవాలని స్నేహితులతో కలిసి బస్సులో బయలుదేరాడు. బస్సు ప్రమాదంలోనే కాలిబూడిదయ్యాడు. మహేంద్రకు భార్య నాగేశ్వరమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేంద్ర మరణించాడని తెలుసుకున్న నాగేశ్వరమ్మ గుండెలవిసేలా విలపిస్తోంది.  

రిజర్వేషన్‌ లేకుండానే బయలుదేరి.. 
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా దుత్తలూరు మండలం మందాలనాయుడుపల్లి గ్రామానికి చెందిన చిలకపాటి వెంకటేష్‌ కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలేక ఖాళీగా ఉంటున్నాడు. ఇటీవల పని నిమిత్తం తెలంగాణకు వెళ్లాడు. తిరిగి స్వగ్రామం వచ్చేందుకు రిజర్వేషన్‌ లేకపోవడంతో బస్సు సిబ్బందితో మాట్లాడి ఎక్కాడు. తాను ఊరికి బయలుదేరినట్టు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో చెప్పాడు. ప్రమాదం తర్వాత అతడి ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో తల్లి రత్నమ్మతోపాటు బంధువులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. డీఎన్‌ఏ శ్యాంపిల్స్‌ అందించారు. వాటిని సరిపోల్చగా వెంకటేష్‌ మరణించినట్టు అధికారులు ప్రకటించారు. వెంకటేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

భర్తకు బదులు వస్తూ.. మృత్యు ఒడికి..
కనిగిరి పట్టణంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటూ బతుకు దెరువు కోసం బేల్దారి పనులకు నిర్మల్‌ వెళ్లిన భర్త దగ్గరికి వెళ్లి.. శ్రీరామ నవమి పండుగకు తిరిగి వస్తూ బస్సు ప్రమాదంలో బండారు పద్మజ మృత్యుఒడికి చేరింది. వీరి స్వగ్రామం వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం. శ్రీరామనవమి పండుగకు కనిగిరి రావాలని భర్త వెంకటరామయ్య రిజర్వేషన్‌ చేసుకున్నాడు. అయితే పిల్లల్ని చూడాలనిపిస్తోందని పద్మ తానే కనిగిరి వెళ్తానంటూ భర్తకు బదులు ఆ టికెట్‌పై బస్సు ఎక్కింది. సజీవదహనమైంది. ఆమె మరణవార్త తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.  

రూ.లక్షతోపాటు అగ్నికి ఆహుతి
ఉదయగిరి మండలం దాసరిపల్లికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు (45) జగిత్యాలకు బేల్దారీ పనుల కోసం వెళ్లాడు. స్వగ్రామం దాసరిపల్లిలో గతేడాది శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా స్వామి  హుండీ నుంచి నగదు తీసుకున్నారు. అందుకు సంబంధించిన వడ్డీని తిరిగి చెల్లించేందుకు మేస్త్రి వద్ద రూ.లక్ష నగదు తీసుకుని జగిత్యాల నుంచి దాసరిపల్లికి బస్సులో బయలుదేరాడు. బస్సు ప్రమాదంలో నగదుతోపాటు వెంకటేశ్వర్లు అగ్ని కీలల్లో సజీవంగా దహనమయ్యాడు. వెంకటేశ్వర్లుకు భార్య, పిల్లలు ఉన్నారు.  

 

రాముని బ్రహ్మోత్సవాల కోసం.. 
బుచ్చిరెడ్డిపాళెం పట్టణం పెద్దూరులోని ఇప్పగుంట వారి డొంక కాలనీకి చెందిన కత్తి జయరాములు (55) తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు బేల్దారీ కూలి పనికి వెళ్లారు. ఆయన భార్య బుజ్జమ్మ జనవరిలో అనారోగ్యంతో మరణించింది. వీరికి సంతానం లేదు. బుచ్చిరెడ్డిపాళెంలో జరిగే కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు బస్సులో బయలుదేరాడు. ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని మరణించాడు.  

కళ్లెదుటే భర్త, ఐదునెలల బిడ్డ సజీవదహనం 
కళ్లెదుటే భర్త, ఐదునెలల బిడ్డ సజీవదహనం అవుతుంటే ఆ మహిళ గుండెలవిసేలా విలపించింది. మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారికట్లకు చెందిన అంబటి అనిల్‌ (27) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. భార్య సౌజన్యతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. వీరికి ఐదునెలల కుమారుడు ఉన్నాడు. గురువారం కుమారుడికి అన్నప్రాశనతోపాటు పేరు పెట్టాలనే ఆలోచనతో బస్సులో స్వగ్రామం బయలుదేరారు. మరో 40 నిమిషాల్లో ఊరులో ఉంటామన్న ఆనందంలో ఉండగానే బస్సులో మంటలు చెలరేగాయి.

అనిల్‌ బిడ్డను భుజాన వేసుకుని భార్యతో దిగేందుకు యత్నించాడు. ముందుగా భార్యను కిందకు నెట్టేశాడు. ఆ తర్వాత పొగ ధాటికి కళ్లు కనిపించకపోవడంతో మంటల్లో చిక్కుకుని బిడ్డతోపాటే సజీవదహనమయ్యాడు. భర్త, బిడ్డ కళ్లెదుటే మంటల్లో కాలిపోతుంటే ఆ ఇల్లాలు నరకయాతన అనుభవించింది. కొడుకును లియో హృదన్‌ (ఇంకా పేరుపెట్టాల్సి ఉంది)  అంటూ గుండెలు బాదుకుంటూ రోదించింది. గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  

బేల్దారీ పనులకెళ్లి తిరిగి వస్తూ.. 
కలిగిరి మండలం బొమ్మరాజు చెరువు ఎస్సీ కాలనీకి చెందిన ఆత్మకూరు చిన్నా (45) హైదరాబాద్‌లో బేల్దారీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శ్రీరామనవవిుకి జగిత్యాల నుంచి కలిగిరికి బయలుదేరాడు. మంటల్లో చిక్కుకుని మరణించాడు. ఇతనికి భార్యతోపాటు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.

అద్దె ఇల్లు ఖాళీ చేసి వస్తూ తల్లికూతుళ్లు బలి
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు యర్రబల్లికి చెందిన నర్సింగ శ్రీను, పొదిలి మండలం ఉన్నగురవాయపాలేనికి చెందిన ప్రభావతి (37) భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల పాప చైత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో శ్రీను బేల్దారి మేస్త్రీ పనులు చేస్తూ కుటుంబంతో అక్కడే ఉంటున్నాడు. శ్రీను ఇటీవల అత్తగారి ఊరిలో పని ఒప్పుకుని ఇక్కడే కుటుంబంతో ఉంటున్నాడు. జగిత్యాలలో వీరు ఉంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేయడానికి శ్రీను భార్య ప్రభావతి, కూతురు చైత్ర వెళ్లారు. ఖాళీ చేసి బస్సులో వస్తుండగా, ప్రమాదం జరిగింది. మంటల్లో తల్లీకూతుళ్లు ఆహుతయ్యారు.  విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న శ్రీను బూడిద కుప్పల్లో మృతదేహాలై ఉన్న తల్లీకూతుళ్లను చూసి గుండెలవిసేలా రోదించాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement