అనంతపురం:: తాడిపత్రి టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ సీరియస్‌గా స్పందించారు. జేసీ వ్యాఖ్యలను ఖండించిన ఎస్పీ... ఆ వ్యాఖ్యలు ఐపీఎస్ అధికారిని భయపెట్టేలా ఉన్నాయన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి వద్ద ఉన్న తుపాకుల లైసెన్స్ రద్దు చేసే అంశంపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటామన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వీలైతే నాలుగు మంచి మాటలు చెప్పాలి కానీ, కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు.
కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ నోరు పారేసుకున్నారు. ‘‘తుపాకులు నీ వద్దే కాదు.. నా వద్ద కూడా ఉన్నాయి. రేయ్ ఏఎస్పీ.. నీ అంతు చూస్తా.. నీకు బుద్ధి, జ్ఞానం లేవు. ఏఎస్పీ రంజిత్ ఓ పనికిమాలిన వాడు.. వేస్ట్ ఫేలో.. గొడవలు జరిగితే ఇంట్లో దాక్కుంటాడు’’ అంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు.


