Omicron: టీకా ప్రాప్తిరస్తు! 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి కోవిడ్‌ వ్యాక్సిన్‌..

Alert Vaccination For Children Aged Between 15 To 18 Begins Today - Sakshi

నేటి నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్

15 నుంచి 18 ఏళ్ల వయస్సు  వారికి వ్యాక్సిన్‌ 

2.02 లక్షల మందికి టీకాలు వేసేందుకు చర్యలు 

ఏర్పాట్లను సమీక్షించిన జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ 

లబ్బీపేట(విజయవాడ తూర్పు): కృష్ణా జిల్లాలో టీనేజర్స్‌కు టీకాలు వేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీని కోసం నేటి నుంచి 7వ తేదీ వరకూ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జాయింట్‌ కలెక్టర్‌(అభివృద్ధి) లోతేటి శివశంకర్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఆదివారం తన చాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15–18 ఏళ్ల మధ్య వయస్సు (టీనేజ్‌) వారందరికీ టీకాలు వేసేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంఆర్‌ఓలు, విద్యాశాఖ అధికారులు, పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. కాలేజీలో డ్రాప్‌ అవుట్‌ పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు నచ్చచెప్పి టీకా వేయించాలన్నారు. టీకాపై అపోహలు వీడేలా, పిల్లల తల్లిదండ్రులను చైతన్య వంతం చేసి, అందరికీ టీకా వేయాలన్నారు. కరోనా నివారణకు టీకానే వజ్రాయుధం అని ప్రజలకు వివరించాలని సూచించారు.  

430 కాలేజీల గుర్తింపు.. 
►గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని కాలేజీలలో టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

►దీనికిగానూ జిల్లాలోని 1,285 సచివాలయాల పరిధి లో 430 కాలేజీలను గుర్తించామని జేసీ చెప్పారు.

►ఇందులో 2.02 లక్షల మంది టీనేజ్‌ వయస్సు వారు ఉన్నారని.. స్కూల్‌ టీచర్లు, కళాశాలల ప్రిన్సిపాల్స్, పిల్లల తల్లిదండ్రులతో సమన్వయ పరచుకుని అర్హులందరికీ టీకాలు వేయాలన్నారు.

►కోవిడ్‌ టీకా తీసుకునేటప్పుడు ఆహారం తిని వేసుకునేలా చూడాలన్నారు.

►కోవ్యాగ్జిన్‌ టీకా 1.28 లక్షల డోస్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటిని ఇప్పటికే పీహెచ్‌సీలకు తరలించినట్లు తెలిపారు. అక్కడ నుంచి సచివాలయాలకు వ్యాక్సిన్‌ పంపనున్నట్లు తెలిపారు.
 
ఫ్రంట్‌ లైన్‌ వర్కర్ల గుర్తింపు.. 
జిల్లాలో ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు 45వేల మంది ఉన్నారన్నారు. వీరిలో రెండో డోసు వేసుకొని ఫిబ్రవరి నాటికి 9 నెలలు పూర్తి అయ్యే వారు 22 వేల మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరందరికీ ఈ నెల 10, 11, 12 తేదీల్లో బూస్టర్‌ డోస్‌ వేసేందుకు సిద్ధం చేశామన్నారు. సమావేశంలో డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుహాసిని, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చదవండి: Omicron surge: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరిక లేఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top