
144కు పైగా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఆదివారం 144కు పైగా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల, శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబోంతులో అత్యధికంగా 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లా ఓజిలి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేటలో 41.8 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు, చిత్తూరు జిల్లా పిపల్లిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
సోమవారం కూడా పలుచోట్ల 42 డిగ్రీల నుంచి 43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. మరోవైపు అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.