ఏపీఐఐసీ దైన్యం.. ప్రైవేటుకు దాసోహం | 14 industrial parks to be privatized | Sakshi
Sakshi News home page

ఏపీఐఐసీ దైన్యం.. ప్రైవేటుకు దాసోహం

Mar 22 2026 4:34 AM | Updated on Mar 22 2026 4:34 AM

14 industrial parks to be privatized

పార్కులు అభివృద్ధి చేయకుండా ప్రైవేటు సంస్థలకు కేటాయింపు 

తాజాగా 14 పారిశ్రామిక పార్కులు ప్రైవేటుపరం  

మొత్తం 4,109.01 ఎకరాలు సొంత వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం 

కనిష్టంగా 100 ఎకరాల నుంచి 500 ఎకరాలు కేటాయింపు 

దొనకొండ, కొప్పర్తి, సంతబొమ్మాళి, నాయుడుపేట వంటి చోట్ల విలువైన భూములు ధారాదత్తం 

రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు దోచి పెడుతుండటంపై విస్తుపోతున్న అధికారగణం

సాక్షి, అమరావతి : ఐటీ కంపెనీల ముసుగులో ఇప్పటికే విశాఖలో వేల కోట్ల రూపాయల భూములను పప్పు బెల్లాలుగా పంచిపెట్టిన చంద్రబాబు సర్కారు కన్ను ఇప్పుడు ఏపీఐఐసీ సేకరించిన విలువైన భూములపై పడింది. అనేక పారిశ్రామిక పార్కుల ఏర్పాటు, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో ఘన చరిత్ర ఉన్న ఏపీఐఐసీని ‘రియల్‌’ దోపీడి సంస్థగా మార్చేస్తున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం పేదల నుంచి కారు చౌకగా సేకరించిన భూములను పారిశ్రామిక పార్కుల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు చౌకగా కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది. 

పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాల్సిన ఏపీఐఐసీ.. ఆ పని వదిలేసి, సేకరించిన భూములను సైతం ప్రభుత్వ పెద్దలకు చెందిన బినామీ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, రహస్య భాగస్వాములకు ధారాదత్తం చేయనుంది. తాజాగా ఇప్పటికే పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందిన నాయుడు పేట, కొప్పర్తి, మాచర్ల, నందిగామ వంటి చోట్ల రూ.కోట్ల విలువైన వందల ఎకరాల భూమిని పబ్లిక్‌ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. 

ఇందుకోసం మొత్తం 14 చోట్ల 4,109.01 ఎకరాల భూమిని ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి ఏపీఐఐసీ ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. అత్యల్పంగా కొప్పర్తిలో 100 ఎకరాలు, అత్యధికంగా నాయుడుపేటలో 500 ఎకరాల భూమిని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టనుంది. పారిశ్రామిక పార్కులు, పెద్ద పెద్ద వాణిజ్య భవనాలు కట్టిన సంస్థలే కాకుండా, రి­యల్‌ ఎస్టేట్‌ సంస్థలు కూడా ఈ బిడ్డింగ్‌లో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. 

ప్రైవేటు పార్కుల పాలసీ ముసుగులో తమకు కావాల్సిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడమే ఈ నిబంధనల ఉద్దేశమ­ని వారు స్పష్టం చేస్తున్నారు. ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన పార్కుల్లో ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 6 శాతం భూమిని కేటాయించాల్సి ఉంటుంది. పారిశ్రామిక పార్కుల పేరిట దళితుల నుంచి భారీ ఎత్తున భూమిని సేకరించి, ఇప్పుడు వాటిని గంపగుత్తగా ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా ఆ రిజర్వేషన్‌కు కూటమి సర్కారు మంగళం పాడుతోంది.  

ఐదు తొలగించి.. నాలుగు చేర్చి.. 
గతేడాది ఆగస్టులో ఏపీఐఐసీ 15 చోట్ల ప్రైవేటు పార్కుల అభివృద్ధి కోసం టెండర్లు పిలిచింది. కానీ అందులో పేర్కొన్న కొన్ని ప్రాంతాల భూములపై రాజకీయ నాయకుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో టెండర్ల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి, తాజాగా టెండర్లను పిలిచింది. ఉదాహరణకు జగ్గయ్యపేట వద్ద ఉన్న జయంతిపురం వద్ద 498.93 ఎకరాల భూమిలో ప్రైవేటు పార్కు అభివృద్ధి కోసం టెండర్లు పిలిచారు. 

కానీ ఈ భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబానికి అత్యంత దగ్గర బంధువులు కన్నేశారు. దీన్ని ప్రైవేటు పార్కుల లిస్టులో పెట్టడంతో వారి నుంచి పెద్దఎత్తున ఒత్తిడి రావడంతో తొలగించారు. ఇదే రీతిలో ఒత్తిడి రావడంతో అచ్యుతాపురం (280.55 ఎకరాలు), రౌతు సురమాల (481.50 ఎకరాలు) కోసలనగరం (500 ఎకరాలు), చిలమత్తూరు (124.36 ఎకరాలు) భూములను తాజాగా టెండర్ల లిస్టు నుంచి తొలగించారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తగా నాయుడుపేట(500 ఎకరాలు), కొప్పర్తి (100 ఎకరాలు), పామూరు (458.07 ఎకరాలు), మాకవారిపాలెం (198.42 ఎకరాలు) వచ్చి చేరాయి. 

గతంలో టెండర్లు పిలిచిన వాటిని ఎందుకు తొలగించారు.. ఇప్పుడు కొత్త వాటిని ఏ విధానంలో చేర్చారన్న దానిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన వివరణ లేదు. ఏపీ ప్రైవేటు ఇండస్ట్రియల్‌ పార్క్స్‌ విత్‌ ప్లగ్‌ అండ్‌ ప్లే ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పాలసీ 2024–29 పేరిట 14 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, ఆసక్తిగల సంస్థలు బిడ్లు దాఖలు చేయడానికి ఏప్రిల్‌ 22 ఆఖరు తేది అని మాత్రమే పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement