12 లక్షల మందికి ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులు

12 lakh free online courses for weaker sections students by Central Govt - Sakshi

బలహీన వర్గాలకు కేంద్రం ప్రత్యేక కార్యక్రమం 

నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ అలయెన్స్‌ ఫర్‌ టెక్నాలజీ ద్వారా అమలు 

సాక్షి, అమరావతి: విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంపొందించడం, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దడం కోసం కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ కోర్సుల ద్వారా సాఫ్ట్‌వేర్, ఇతర ఐటీ ఆధారిత అంశాల్లో నైపుణ్యాలను మెరుగుపర్చాలని నిర్ణయించింది.

ఇందుకోసం విద్యా మంత్రిత్వ శాఖ 12 లక్షల మంది విద్యార్థులకు నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ అలయన్స్‌ ఫర్‌ టెక్నాలజీ (నీట్‌) పోర్టల్‌ ద్వారా ఆర్థిక సాయం అందించనుంది. విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్‌ రంగంలో నైపుణ్యం, నిర్వాహక (అడ్మినిస్ట్రేటివ్‌) వ్యవహారాలు మొదలైన వాటిలో నైపుణ్యాన్ని సాధించేలా చేయడం ఈ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ కోర్సుల లక్ష్యంగా కేంద్రం నిర్ణయించింది.  కృత్రిమ మేధస్సును (ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఉపయోగించి అభ్యర్థుల వ్యక్తిగత సామర్థ్యాలను బట్టి ఆయా కోర్సులకు ఎంపిక చేస్తారు. 

ఎడ్‌టెక్‌ కంపెనీల భాగస్వామ్యంతో శిక్షణ 
ఇందుకోసం ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) ద్వారా వివిధ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ కంపెనీలతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోనుంది. అనేక పరిమితుల ఆధారంగా వీటిని కౌన్సిల్‌ ఎంపిక చేసింది. నీట్‌ పోర్టల్‌ ద్వారా రిజిస్టర్‌ అయిన అభ్యర్థుల నుంచి ఈ ఏడాదికి సంబంధించి శిక్షణ కోసం ఎంపిక ప్రక్రియ ఇటీవలే ఏఐసీటీఈ ప్రారంభించింది. ఎడ్‌ టెక్‌ కంపెనీలు సర్టిఫికేషన్‌ కోర్సులు, సైకోమెట్రిక్‌ పరీక్షలు, అసెస్‌మెంట్‌ టెస్ట్‌లు, లేబొరేటరీ టూల్స్, ఇంటర్న్‌షిప్‌ సపోర్ట్, ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లు, కాగ్నిటివ్‌ స్కిల్స్, మార్కెటింగ్‌ నైపుణ్యాలు, ప్లేస్‌మెంట్‌ సపోర్ట్, ఇంటర్న్‌షిప్‌ సపోర్ట్, మేనేజ్‌మెంట్, అకౌంట్, ఫైనాన్స్‌ వంటి ఈ–కంటెంట్‌లను అందిస్తాయి.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top