అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 23 మండలాల పరిధిలో 8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కంబదూరు 45.4 మి.మీ, పెద్దవడుగూరు 28.8, విడపనకల్లు 22.8, కుందుర్పి 17.6, పామిడి 15.4, రాప్తాడు 15.2, గుత్తి 12.4 మి.మీతో పాటు రాయదుర్గం, బెళుగుప్ప, కళ్యాణదుర్గం, శెట్టూరు, బ్రహ్మసముద్రం, గుంతకల్లు, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, అనంతపురం, గార్లదిన్నె, శింగనమల, నార్పల, యల్లనూరు తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు.
వృద్ధాప్య సహాయానికి దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం క్రైం: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధాప్య ఆర్థిక సహాయం పొందేందుకు జూన్ 30లోగా దరఖాస్తులు సమర్పించాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గంగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీసీఎస్‌లో కనీసం ఐదు సంవత్సరాలు సభ్యత్వం కలిగి ఉండి, 63 ఏళ్లు పూర్తి చేసుకున్న విశ్రాంత ఉద్యోగులు ఈ సహాయానికి అర్హులని పేర్కొన్నారు. భద్రతా పథకంలో సభ్యులుగా ఉన్న వారు ఈ పథకానికి అర్హులు కాదని స్పష్టం చేశారు. దరఖాస్తు ఫారాలు అనంతపురం కొత్త బస్టాండ్ సమీపంలోని డిపో వద్ద ఉచితంగానే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన సభ్యులు దరఖాస్తులను పూర్తి చేసి జూన్ 30లోగా ప్రధాన కార్యాలయానికి చేరేలా పంపించాలని సూచించారు. ఇతర వివరాల కోసం 99854 31084 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
22 మందికి
తహసీల్దార్లుగా పదోన్నతి
అనంతపురం అర్బన్: జోన్–5 పరిధిలో జిల్లాకు సంబంధించి 2017–18 బ్యాచ్‌కు చెందిన 18 మంది పీడీటీలు (ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్లు), నలుగురు ఆర్‌పీ (ర్యాంక్ ప్రమోటీస్)లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు సీసీఎల్‌ఏ జె.విజయలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్లుగా పదోన్నతి పొందిన వారికి త్వరలో జిల్లాలో పోస్టులు కేటాయిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
పదోన్నతి పొందింది వీరే..
తహసీల్దార్లుగా పదోన్నతి పొందిన పీడీటీలు బి.రవి, వెలగరెడ్డి శేఖర్, ఆర్.బాలాంజినేయులు, ఆర్.సూర్యప్రతాప్, కె.ఎస్.మారుతీప్రకాశ్, సి.మనోజ్‌కుమార్, వి.మహేశ్వరరెడ్డి, టి.శ్రీనివాసరెడ్డి, ఎం.క్రాంతికుమార్, పి.ముకుంద, ఎం.ఉదయ్‌భాస్కర్, కె.మధునాయక్, పి.సింధు, బి.సురేంద్రనాథ్, సి.జయశ్రీ, పి.అరుణ, ఎస్.ఆర్.సంహిత, డి.వెంకటేశ్వరమ్మ ఉన్నారు. ఇక ఆర్‌పీలు కె.నరసింహులు, బి.హనుమంతు, జి.విజయలక్ష్మి, బి.బాలమ్మ తహసీల్దార్లుగా ప్రమోషన్ పొందారు.
‘పల్స్ పోలియో’
విజయవంతం చేయాలి
అనంతపురం సిటీ: ఈ నెల 28 నుంచి చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈబీ దేవి అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పీహెచ్‌సీ, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ఆమె సమీక్షించారు. ఈ నెల 28న పోలియో కేంద్రాల ద్వారా పిల్లలకు చుక్కల మందు ఇవ్వాలన్నారు. 29, 30 తేదీల్లో నిర్దేశించిన గ్రామాల్లోని ప్రతి ఇంటినీ ఆరోగ్య సిబ్బంది సందర్శించి ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు అందించాలన్నారు. కార్యక్రమంలో డీపీఎంఓ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఓ మహమ్మద్ రఫీ, వ్యాక్సిన్ సూపర్‌వైజర్ శామ్యూల్ పాల్గొన్నారు.
అడిషనల్ ఎస్పీగా మహబూబ్‌బాషా
అనంతపురం సెంట్రల్: మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ మహబూబ్‌బాషాకు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి దక్కింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అడిషనల్ ఎస్పీ హోదాలో మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీగా కొనసాగుతూనే అనంతపురం అర్బన్ డీఎస్పీ ఇన్‌చార్జ్ బాధ్యతలూ నిర్వర్తించనున్నారు. ఈ సందర్బంగా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.


