అరబిక్‌ కళాశాలకు వందేళ్లు | - | Sakshi
Sakshi News home page

అరబిక్‌ కళాశాలకు వందేళ్లు

May 21 2026 1:53 AM | Updated on May 21 2026 1:53 AM

రాయదుర్గం టౌన్‌: స్థానిక కణేకల్లు మార్గంలో నెలకొల్పిన అరబిక్‌ కళాశాల శతవార్షికోత్సవానికి ముస్తాబైంది. పది దశాబ్దాలుగా విద్యార్థులకు అత్యుత్తమ ఇస్లామిక్‌ విద్యా బోధనను అందిస్తున్న ఈ కళాశాలను జామియా మహమ్మదీయ అరబిక్‌ కళాశాలగా పిలుస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే ఈ కళాశాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేశంలోని అనేక రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ ఇస్లామిక్‌ విద్యను అభ్యసిస్తున్నారు. చాలా కాలంగా బళ్లారి మార్గంలో ఉన్న ఈ కళాశాలలను ఇటీవల కణేకల్లు మార్గంలోని నూతన భవన సముదాయంలోకి మార్చారు. గురువారం శతవార్షికోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు.

సౌదీ అరేబియా వర్సిటీ అనుబంధంగా...

రాయదుర్గానికి చెందిన మౌలానా సయ్యద్‌ ఇస్మాయిల్‌ సాహెబ్‌ 1926లో అరబిక్‌ కళాశాలను స్థాపించారు. ఆ రోజుల్లో ఆయన సేకరించిన గ్రంథాల్లో అక్బర్‌ కాలం నాటి ఓ గ్రంథం ఉండడం విశేషం. ఆయన మరణానంతరం కుటుంబసభ్యులే కళాశాలను నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం సయ్యద్‌ ఇస్మాయిల్‌ సాహెబ్‌ మనవడు సయ్యద్‌ అమీర్‌ హమ్జా ఆ కళాశాల కరస్పాండెంట్‌గా కొనసాగుతున్నారు. ఇక్కడ ఉర్దూ, అరబిక్‌తో పాటు పర్షియా, ఇంగ్లిష్‌ భాషల్లో విద్యా బోధన సాగుతోంది. ప్రధానంగా అరబిక్‌ భాషలో అలిమ్‌ ఫాజిల్‌ (8 ఏళ్ల కోర్సు), మున్ఫిఫాజిల్‌ (మూడేళ్ల కోర్సు)తో పాటు హఫీజ్‌ కోర్సులూ అందజేస్తున్నారు. సౌదీ అరేబియాలోని మదీనా యూనివర్సిటీ అనుబంధంగా ఈ కోర్సులను అమలు చేస్తున్నారు. అలీమ్‌ ఫాజిల్‌ కోర్సులో 90 శాతం మార్కులతో ఉతీర్ణత సాధించిన విద్యార్థులకు మదీనా యూనివర్సిటీలో ఉన్నత విద్యకు అవకాశం కల్పిస్తున్నారు.తొలి రోజుల్లో ఈ కళాశాలలో చదివిన విద్యార్థి మాల్దీవుల గవర్నర్‌గా పనిచేయడం రాయదుర్గానికే గర్వకారణంగా నిలిచింది.

హాజరుకానున్న ప్రముఖులు

గురువారం జరిగే అరబిక్‌ కళాశాల శతవార్షికోత్సవానికి ఇస్లామిక్‌ పండితులు హాజరవుతున్నట్లు ఆ కళాశాల అభివృద్ధి కమిటీ సెక్రటరీ సయ్యద్‌ అమీర్‌ హమ్జా తెలిపారు. షార్జా నుంచి ప్రముఖ ఇస్లామిక్‌ పండితుడు షేక్‌ జఫురుల్‌ హసన్‌, బెంగళూరు నుంచి అసిమ్‌ ఖాన్‌, గుల్బర్గా నుంచి షేక్‌ జవాద్‌ హాజరవుతున్నారన్నారు. విద్యాబోధన పూర్తి చేసిన విద్యార్థులకు అలిమ్‌ ఫాజిల్‌, ఖురాన్‌ హఫీజ్‌ సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నట్లు వివరించారు.

నేడు శతవార్షికోత్సవం

హాజరుకానున్న ఇస్లామిక్‌ పండితులు

Advertisement
 
Advertisement
Advertisement