యాడికి: మండలంలోని చందన గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మర ఆంజనేయులు, అనిత దంపతుల కుమార్తె నైనిక (6) గుండె పోటుతో మృతి చెందింది. నైనిక ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో బుధవారం ఉదయం 11 గంటలకు గ్రామ సమీపంలో ఆడుకుంటూ ఉన్నఫళంగా కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులు వెంటనే రాయలచెరువులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటు కారణంగా చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.
గంజాయి ముఠా అరెస్ట్
● 10.55 కేజీల గంజాయి స్వాధీనం
తాడిపత్రి టౌన్: తాడిపత్రి మీదుగా సూరత్‌కు గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం తాడిపత్రి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్పీ రోహిత్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. ఒడిశాకు చెందిన బలరాం స్వామ్స్ ఓ మైనర్‌తో కలిసి ఒడిశా నుంచి గంజాయిని తాడిపత్రి మీదుగా సూరత్‌కు సరఫరా చేస్తున్నారు. ఇందులో భాగంగా సూరత్‌కు రైలులో గంజాయి తీసుకెళ్తుండగా అందిన సమాచారం మేరకు తాడిపత్రి పోలీసులు బుధవారం రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన బలరాం స్వామ్స్‌తో పాటు మైనర్ బాలుడిని సోదా చేయగా వారి వద్ద 10.55 కేజీల గంజాయి దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో తదుపరి చర్యల కోసం కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. చాకచక్యంగా ముఠాను పట్టుకున్న కానిస్టేబుల్ గోవిందుకు రివార్డు అందజేశారు. కార్యక్రమంలో సీఐ ఆరోహణరావు, ఎస్‌ఐ దయాకర్‌రెడ్డి, ఏఎస్‌ఐ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్యపై
ప్రత్యేక కంట్రోల్ రూమ్
అనంతపురం ఎడ్యుకేషన్: వేసవి దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా సంబంధిత ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రజలు నేరుగా ఈ కంట్రోల్ రూమ్‌ను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని డీపీఓ నాగరాజనాయుడు పేర్కొన్నారు. ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు చేరవేసి తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సేవలు రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలు 95504 80972 నంబర్‌కు కాల్ చేసి సమస్యలను తెలియజేయవచ్చన్నారు.
పెన్నహోబిలం
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు బుధవారం అంకురార్పణ జరిగింది. ఉదయం స్వామి వారి మూలవిరాట్‌కు సుప్రభాత సేవల్లో భాగంగా ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజలు చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజస్తంభం వద్ద ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. సాయంత్రం ప్రాకారోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ రేగాటి నాగరాజు, ఈఓ సాకే రమేష్ బాబు, అర్చకులు ద్వారకనాథాచార్యులు, బాలాజీస్వామి పాల్గొన్నారు.
జేడీఏగా సవ్యార్‌నంద్
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ)గా ఎస్.బ్లాక్‌థిల్ సవ్యార్‌నంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫిషియో స్పెషల్‌చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సవ్యార్‌నంద్‌కు అడహాక్ కింద జేడీఏగా పదోన్నతి కల్పించి జిల్లాకు బదిలీ చేశారు. అయితే ఆయన డిప్యుటేషన్ మీద అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో)గా పనిచేయనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా జేడీఏ ఇన్‌చార్జ్‌గా ముదిగల్లు రవి కొనసాగుతున్నారు. జిల్లాకు రెగ్యులర్ జేడీఏ నియమితులైనా...ఆయన డిప్యుటేషన్ తీసుకోవడంతో ప్రస్తుతమున్న రవి మరికొద్ది కాలం కొనసాగనున్నారు.


