ఈత .. కారాదు గుండెకోత | - | Sakshi
Sakshi News home page

ఈత .. కారాదు గుండెకోత

Apr 30 2026 8:01 AM | Updated on Apr 30 2026 8:01 AM

బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్‌ కాలువ సమీపంలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఏడో తరగతి విద్యార్థి విజయ్‌కుమార్‌ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు.

రాయదుర్గం: జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల పరిధిలో ప్రవహిస్తున్న వేదవతి హగరితో పాటు, బీటీపీ, పీఏబీఆర్‌, జీడిపల్లి రిజర్వాయర్లు, మైనర్‌, మేజర్‌ ఇరిగేషన్‌ చెరువులు, బావుల్లో నీటి నిల్వలు ఉన్నాయి. బీటీపీ కుడి, ఎడమ కాలువలు నిండుగా పారుతున్నాయి. వేసవి తాపం తట్టుకునేందుకు ఆయా గ్రామాల పరిధిలో విద్యార్థులు ఈతకు కాలువల్లో దిగుతున్నారు. గంటల తరబడి నీటిలోనే ఉంటున్నారు. మరి కొందరు వేదవతి హగరిల్లో ఈత కొట్టేందుకు వెళ్తున్నారు. నీటి లోతును తక్కువగా అంచనా వేసి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.

కనిపించని హెచ్చరిక సూచికలు

బీటీ ప్రాజెక్ట్‌లో ఈత కోసం వెళ్లి మృత్యుఒడికి చేరే వారి సంఖ్య క్రమంగా ఎక్కువవుతోంది. పంట కాలువలు, వేదవతి హగరిల్లోనూ అలాంటి ఘటనలే కనిపిస్తున్నాయి. పర్యాటకులు, సరదాగా వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువే. సెల్పీలు, ఫొటోలు దిగుతూ నీటి అంచుల్లో వినోదాన్ని ఆస్వాదిస్తుంటారు. ఈ క్రమంలో అనుకోకుండా నీటిలో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. నీరుండే రిజర్వాయర్లు, చెరువులు, హగరి వద్ద హెచ్చరిక సూచికలు లేకపోవడంతో లోతు ఎంతుందో తెలియక ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి

● చెరువులు, నది పరివాహక ప్రాంతాల్లో మట్టి, ఇసుక కోసం తీసిన గోతుల్లో నీరు చేరుకోవడంతో లోతు ఎంతుందో తెలియదు. ఇలాంటి సమయంలో గోతులు ఎక్కడ ఉంటాయో తెలుసుకుని అప్రమత్తంగా వ్యవహరించాలి. రిజర్వాయర్లు, చెరువుల్లో చేపల కోసం అమర్చిన వలలు ఉంటాయి. అందులో చిక్కుకుని ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది.

● కాలువల్లో నీటి ప్రవాహ వేగం అంచనా వేయలేం. ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటే ఈత వచ్చిన వారు సైతం కొట్టుకుపోయో ప్రమాదం ఉంది.

● ఈత రాని వారు తేలికై న ట్యూబ్‌లు, బెండ్లు వినియోగించాలి. వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఈత నేర్చుకునే వారు లోతు తక్కువగా ఉన్న ప్రదేశాలనే ఎంపిక చేసుకోవాలి.

● ఈత కొట్టే సమయంలో సరదాలు, పందేలు, అత్యుత్సాహం, సెల్ఫీలు తీసుకోవడం మంచిదికాదు.

విషాదం కారాదు

అవగాహన లేని ఈత సరదా చాలా మంది కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఈతకెళ్లిన సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. నీటి లోతు తెలియకుండా దిగడం ప్రమాదకరం. నీటి వనరుల వద్ద సెల్ఫీలు దిగడం మంచిది కాదు. పాఠశాలలకు వేసవి సెలవుల నేపథ్యంలో బీటీపీ వద్ద పోలీసు గస్తీ పెంచాం. పర్యాటకుల్ని అప్రమత్తం చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాం. సంబంధిత అధికారులతో చర్చించి నీటి వనరుల వద్ద హెచ్చరికబోర్డులు కూడా ఏర్పాటు చేయిస్తాం. వేసవి సెలవులు కావడంతో పిల్లలను తల్లిదండ్రులు కూడా ఓ కంట కనిపెట్టాలి.

– వెంకటరమణ, సీఐ, రాయదుర్గం

గుమ్మఘట్ట మండలం కోనాపురం గ్రామానికి చెందిన విద్యార్థి శరత్‌ తన తల్లిదండ్రులతో కలిసి బెంగళూరుకు వలస వెళ్లాడు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తుండగా అక్కడే పదో తరగతి చదువుకుంటున్నాడు. వేసవి సెలవులు కావడంతో రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామంలో ఉండే అమ్మమ్మ ఇంటికి ఇటీవల వచ్చాడు. రెండు రోజుల క్రితం వేదవతి హగరిలో సరదాగా ఈతకు వెళ్లాడు. నీటిలో ఆడుకుంటూ లోతైన గుంతలోకి వెళ్లడంతో ఈత రాక నీట మునిగి మృతి చెందాడు.

డి.హీరేహాళ్‌ మండలం బాదనహాళ్‌ వద్ద రెండు రోజుల క్రితం నీటి గుంతలో ఈతకు వెళ్లిన కర్ణాటకలోని నాగసముద్రానికి చెందిన టైలర్‌ హంపన్న మృతి చెందాడు. కల్యంలోని బందువుల ఇంట్లో పెళ్లి వేడుకలకు వచ్చి సరదగా ఈతకు వెళ్లాడు. గుంత లోతు తెలియక బురదలో కూరుకుపోయి ప్రాణాలు వదిలాడు.

.. ఇలా ఈ మూడు ఘటనలే కాదు.. వేసవి వచ్చిందంటే చాలు జిల్లాలోని ఏదో ఓ చోట విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

ఈత సరిగా రాక ప్రమాదాలు

ప్రతి వేసవిలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం

తల్లిదండ్రులకు కడుపుకోత

మృతుల్లో పిల్లలు, యువకులే అధికం

Advertisement
 
Advertisement
Advertisement