కూడేరు: మండలంలోని చోళసముద్రానికి చెందిన రైతు ప్రవీణ్ సాగు చేసిన అరటి తోట మంటల్లో కాలిపోయింది. కడదరకుంట గ్రామం సమీపంలో తనకున్న ఏడున్నర ఎకరాల పొలంలో 12,800 అరటి చెట్లను రైతు పెంచుతున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్ తోట పక్కనే ఉన్న రైతు తన పొలం గట్టును శుభ్రం చేసుకునే క్రమంలో ఎండు గడ్డికి బుధవారం నిప్పు రాజేశాడు. దీంతో మంటలు చెలరేగి ప్రవీణ్ అరటి తోటను చుట్టుముట్టాయి. గమనించిన చుట్టుపక్కల రైతులు మంటలు అర్పే లోపు 3 వేల అరటి చెట్లు, డ్రిప్ పైపులు, పరికరాలు కాలిపోయాయి. ఘటనతో రూ.6 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వివాహిత ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: స్థానిక గన్నెవారిపల్లి కాలనీలో నివాసముంటున్న వివాహిత గంగాపావని (19) ఆత్మహత్య చేసుకుంది. గంగాపావని, సాయి ప్రేమించి 7 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి రెండు కుటుంబాలకు ఇష్టం లేదు. ఈ కారణంగా తరుచుగా రెండు కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకునేవి. దీంతో మనస్తాపానికి గురైన గంగాపావని బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి వెంకటనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు.
నేటితో ముగియనున్న
శాప్ ఫుట్‌బాల్ టోర్నీ
అనంతపురం: ఆర్డీటీ స్టేడియంలో నిర్వహిస్తున్న శాప్ ఫుట్‌బాల్ టోర్నీ గురువారంతో ముగియనుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో అండర్–15 బాలుర విభాగంలో ముందంజలో అన్నమయ్య, నెల్లూరు, శ్రీసత్యసాయి, తిరుపతి, ఏలూరు, పల్నాడు, శ్రీకాకుళం, అనంతపురం, నెల్లూరు, కృష్ణా జట్లు ఉన్నాయి. అలాగే బాలికల విభాగంలో నెల్లూరు, కర్నూలు, అనంతపురం, ఏలూరు, అన్నమయ్య జట్లు, అండర్–21 పురుషుల విభాగంలో అల్లూరి సీతారామరాజు, తిరుపతి, ఏలూరు, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, శ్రీసత్యసాయి, తిరుపతి, గుంటూరు, అన్నమయ్య, మహిళా విభాగంలో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు జట్లు ముందంజలో ఉన్నాయి.
ఆక్సిజన్ అందక అపస్మారక స్థితిలోకి వెళ్లిన కూలీలు
తాడిపత్రి రూరల్: స్థానిక సంజీవనగర్‌లోని వాటర్ ట్యాంక్ లోపల పెయింట్ కొడుతూ ఊపిరి అందక ఇద్దరు కూలీలు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాల కోసం సంజీవనగర్‌లో వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతోంది. ట్యాంకు లోపలి భాగంలో పెయింట్ వేసే పనిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కూలీలు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో బుధవారం కూలీలు అర్జున్‌కుమార్, రామ్‌చరణ్ ట్యాంక్ లోపల దిగి పెయింట్ వేస్తుండగా ఆక్సిజన్ తక్కువై ఊపిరి అందక కేకలు వేస్తూ కుప్పకూలిపోయారు. ట్యాంక్ పైభాగంలో ఉన్న మరో కూలీ విషయాన్ని వెంటనే మేసీ్త్రకి ఫోన్ చేసి తెలిపాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక ఎస్‌ఐ మోహన్‌బాబు, సిబ్బంది అక్కడకు చేరుకుని అపస్మారక స్థితికి చేరుకున్న కూలీలను అతి కష్టంపై వెలికి తీసుకువచి, అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చీటింగ్ కేసు నమోదు
తలుపుల: డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను బుధవారం వెల్లడించారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం మూడిళ్లపల్లికి చెందిన రామాంజనేయులు, ఓబులరెడ్డి తలుపుల మండలం సంగటివారిపల్లికి చెందిన మల్లినాయుడు వద్ద గత ఏడాది జనవరిలో 105 పొట్టేళ్లను రూ.11.20 లక్షలతో కొనుగోలు చేశారు. అప్పట్లో రూ.4.20 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించారు. ఈ క్రమంలో మిగిలిన డబ్బు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. గట్టిగా అడిగితే బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు రామాంజనేయులు, ఓబులరెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెన్నయ్య తెలిపారు.


