● ఉపన్యాసాలు సరే.. మహిళపై దాడి సంగతేంటి?
● మాజీ ఎంపీ తలారి రంగయ్య ధ్వజం
అనంతపురం: ఆగర్భ శ్రీమంతుడిని అని చెప్పుకునే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు టోల్‌గేట్ చెల్లించలేని స్థితిలో ఉన్నాడని వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య ఎద్దేవా చేశారు. ముందస్తుగా రూ.3వేలు చెల్లిస్తే ఏడాదిలో 200 టోల్‌గేట్లను దాటే అవకాశం ఉంటుందని, ఇది కూడా తెలియని స్థితిలో ఎమ్మెల్యే ఉన్నారా? అని ప్రశ్నించారు. సోమవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో తలారి రంగయ్య మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య జిల్లా గండబోయినపల్లె టోల్‌గేట్ వద్ద అహంకారంతో, అధికార గర్వంతో ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు టోల్‌గేట్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారని విమర్శించారు. మహిళని కూడా చూడకుండా దుర్భాషలాడుతూ భౌతికదాడి చేశారని ఆవేదన చెందారు. ఈ నెల 23న కళ్యాణదుర్గంలో మహిళల భద్రతపై ఎమ్మెల్యే సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని, మరుసటి రోజే టోల్‌గేట్ వద్ద ఆయన అనుచరులు మహిళపై దాడి చేశారని అన్నారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే దాడి చేశారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అక్రమార్జనలో అమిలినేని అగ్రస్థానం
ఎమ్మెల్యే అమిలినేని అక్రమార్జనలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అడుగడుగునా బెల్టుషాపులు ఉన్నాయని, మద్యం బాటిల్‌పై రూ.20 అధికంగా వసూలు చేస్తున్నారని, నెలకు రూ.కోటి అక్రమంగా ఆర్జిస్తున్నారని ఆరోపించారు. కొండల్ని పిండిచేసి మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీటీపీ కాలువ కోసం భూమి కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలన్నారు. రెండేళ్లవుతున్నా ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదన్నారు. అనంతపురంలో నిర్వహించిన బీసీ గళం విజయవంతం కావడంతో ఇప్పుడు అధికార పార్టీ బీసీ నాయకులు బయటకు వచ్చి.. బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు పాల బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, గోళ్ల సూరి, ఎంఎస్ హనుమంతరాయుడు, జిల్లా కార్యదర్శి ఎర్రంపల్లి కృష్ణమూర్తి, మున్సిపల్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు దొడగట్ట మురళి, ఎనుములదొడ్డి మాజీ సర్పంచ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.


