తాడిపత్రి రూరల్: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రతతో పెద్దలు సైతం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడి పోతున్నారు. ఉదయం 10 గంటలకే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. కానీ అంగన్‌వాడీ ఫ్రీ సూళ్లకు వెళ్లే 3–6 ఏళ్ల లోపు చిన్నారులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ఇవ్వలేదు. అటు తెలంగాణ, ఇటు కర్ణాటక రాష్ట్రాలు సైతం అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించాయి. చంద్రబాబు సర్కారు మాత్రం చిన్నారులకు వేసవి సెలవులు ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండల కారణంగా తమ పిల్లలకు వడదెబ్బ సోకి ఏమైనా జరిగితే అందుకు చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చిన్నారుల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.
ఒంటిపూట.. అయినా ఇబ్బందే
జిల్లా వ్యాప్తంగా 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,079 అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు 223 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 71వేలకు పైగా చిన్నారులు ఉండగా 3నుంచి 6ఏళ్లలోపు చిన్నారులు 35650మంది ఉన్నారు. 7,655 మంది గర్భిణులు, 7,250 మంది బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సేవలు అందుకుంటున్నారు. అంగన్‌వాడీ సెంటర్లల్లోని చిన్నారులకు ఉక్కపోత తప్పడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్నా ఉష్ణోగ్రతల వల్ల ఎక్కడ చిన్నారులు వడదెబ్బ, అనారోగ్యాలకు గురవుతారోనన్నా భయంతో తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రాలకు పంపడం లేదు. జిల్లాలో ఎండల తీవ్రత కారణంగా తాడిపత్రి మండలంలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. అలాగే మరికొన్ని మండలాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు జిల్లా విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఎండలు ఇలాగే కొనసాగితే వడగాలులు వీచే అవకాశం ఉందని సంస్థ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇలాంటి తరుణంలో అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించకుండా ప్రభుత్వం ఉదయం 8 నుంచి 12గంటల వరకు చిన్నారులకు ఒంటిపూట బడి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత సెంటర్ల నుంచి దూరంగా వివాసముంటున్న చిన్నారులు ఇళ్లకు తమ తల్లిదండ్రులతో మండుటెండలో నడుచుకుంటూ వెళుతుండటం సాహసంగా మారుతోంది. దీంతో చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు.
అసౌకర్యాల మధ్య అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు ఎక్కువగా అద్దె ఇళ్లల్లో అసౌకర్యాల మధ్య ఉంటున్నాయి. పట్టణాల్లో అత్యధికం అద్దె ఇళ్లే. గ్రామీణ ప్రాంతాల్లో కొంత వరకు పక్కా భవనాలు ఉన్నాయి. ఇరుకై న భవనాల్లో అసౌకర్యాల మధ్య చిన్నారులతో పాటు సిబ్బంది సైతం అల్లాడిపోతున్నారు. కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు ఉన్నా... అప్రకటిత విద్యుత్ కోత, ఇతర కారణాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విద్యార్థులు ఉక్కపోతను భరించకలేక పోతున్నారు. ఈ క్రమంలో ఎండ తీవ్రత పెరిగినప్పటి నుంచి సగానికి పైగా చిన్నారులు కూడా హాజరు కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం మీనవేశాలు లెక్కిస్తోంది.
ఉక్కపోతతో అల్లాడిపోతున్న చిన్నారులు
వేసవి సెలవుల ప్రకటనపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం
తెలంగాణ, కర్ణాటకలో సెలవులు ప్రకటించిన ప్రభుత్వాలు
వేసవి సెలవులు ఇవ్వాలి
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో టీచర్లు, ఆయాలు ఇబ్బందులు పడుతున్నారు. మే నెలంతటా సెలవులు ఇవ్వాలి. ఇదే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఐసీడీఎస్ పీడీని కలిసి వేసవి సెలవులపై ప్రస్తావించనున్నాం.
– రమాదేవి, అంగన్‌వాడీ హెల్పర్స్
అండ్ వర్కర్స్ అసోసియేషన్
జిల్లా ప్రధాన కార్యదర్శి


