అనంతపురం కల్చరల్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి (మంగళవారం) నుంచి నలబై రోజుల పాటూ ‘వేసవి విజ్ఞాన శిక్షణా శిబిరం’ నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రంథాలయ పాలకుల (లైబ్రేరియన్లు) పరిస్థితి అడకత్తెరలో పొకచెక్కలా మారింది. అసలే మూడు నెలలుగా జీతాలందక సతమతమవుతున్న నేపథ్యంలో ఎలాంటి నిధులు విడుదల చేయకనే వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహించాలంటూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు గోరు చుట్టపై రోకటి పోటులా మారింది. జీతాలు వచ్చే రోజుల్లోనూ అరకొర బడ్జెట్ విడుదల కావడంతో ఇబ్బంది పడిన లైబ్రేరేయన్లు.. ఈసారి జేబులో చిల్లిగవ్వలేకుండా సమ్మర్ క్యాంపులు ఎలా నిర్వహించాలో తెలియక మదన పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 70 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిల్లో గ్రేడ్ 1 గ్రంథాలయాలుగా జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటూ ధర్మవరం, రాయదుర్గం, గుంతకల్లు ఉండగా గ్రేడ్ – 2 గ్రంథాయాలు 8 ( గుత్తి, ఉరవకొండ, పెనుకొండ, కదిరి, మడకశిర, తాడిపత్రి, కల్యాణదుర్గంతో పాటూ జిల్లాకేంద్రంలోని ఉమెన్స్ లైబ్రరీ) ఉన్నాయి. మిగిలిన 58 గ్రంథాలయాలు గ్రేడ్ 3 పరిధిలోకి వస్తాయి. వీటిన్నంటిలో ఈ నెల 28 నుండి జూన్ నెల 6 వరకు సమ్మర్ క్యాంపులు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా వేసవి శిక్షణా శిబిరాల నిర్వహణకు గ్రేడ్ 1 గ్రంథాలయాలకు రూ.15 వేలు, గ్రేడ్ 2 గ్రంథాలయాలకు రూ.12 వేలు, గ్రేడ్ 3 గ్రంథాలయాలకు రూ.10 వేలు చొప్పున మాత్రమే నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ నిధులతో 40 రోజుల పాటు శిబిరం నిర్వహణ సాధ్యం కాదు. శిక్షణ ఇచ్చేందుకు వచ్చేవారికి కనీసం గౌరవ భత్యం ఇవ్వాలి. నిత్యం విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్లు ఇవ్వడం, వివిధ రకాల పోటీలకు కొంతలో కొంత సామగ్రిని సమకూర్చుకోవడం, ముగింపు రోజు ఉత్సవం నిర్వహించి విద్యార్థులకు బహుమతుల ఖర్చులు కలుపుకుంటే ప్రభుత్వం విడుదల చేసే నిధులకు రెట్టింపు అవుతుంది. దీంతో ఏటా గ్రంథాలయాధికారులు తమ సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వ ఉత్తర్వులను పాలిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ వేసవికి ముందు మూడు నెలలుగా జీతాలు లేవు. దీనికి తోడు శిబిరాల నిర్వహణకు బడ్జెట్ కూడా లేదంటే నిర్వహణ భారం మొత్తం గ్రంథాలయాధికారులపై పడుతోంది. ఇప్పటికే గత గ్రంథాలయ వారోత్సవాల బిల్లులు, రెండు సమ్మర్ క్యాంపుల బిల్లులు నేటికీ పెండింగులో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మళ్లీ వేసవి శిక్షణ శిబిరాలనగానే చాలా మంది గ్రంథాలయాధికారులు లోలోన అసంతృప్తితో రగిలిపోతున్నారు.
నేటి నుంచి వేసవి విజ్ఞాన శిబిరాల నిర్వహణ
నిధులు కేటాయించకపోవడంతో
తీవ్ర ఇబ్బంది
నేటికీ అందని గత రెండేళ్ల వేసవి శిబిరాల నిర్వహణ బిల్లులు
ఇప్పటికే పేరుకుపోయిన మూడునెలల వేతన బకాయిలు
సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి
విద్యార్థులను మనోవైజ్ఞానికంగా ఉన్నతులను చేసే గ్రంథాలయాల సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్, కార్యదర్శి కమ్మన్న పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం కేంద్ర గ్రంథాలయంలో సమ్మర్ క్యాంపు పోస్టర్లను గ్రంథాలయాధికారులతో కలసి వారు ఆవిష్కరించి, మాట్లాడారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది గోవిందు, రాజు, రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు.


