ఆలయ కమిటీ నియామకమెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

ఆలయ కమిటీ నియామకమెప్పుడో?

Apr 11 2026 8:34 AM | Updated on Apr 11 2026 8:34 AM

చింతలరాయుడి ఆలయ కమిటీ ఎన్నికపై కమ్ముకున్న నీలి నీడలు

గత ఆగస్టులో నోటిఫికేషన్‌ ఇచ్చినా చివరి క్షణంలో వాయిదా

తాడిపత్రి రూరల్‌: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న తాడిపత్రిలోని భూదేవి, శ్రీదేవి సమేత చింతల వేంకటరమణస్వామి ఆలయం కమిటీ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వర ఆలయంతో పాటు చింతల వేంకటరమణస్వామి ఆలయ కమిటీలు వైదొలిగాయి. దీంతో నూతన కమిటీల ఎన్నికకు గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే రెండు దేవాలయాల్లో పట్టు కోసం కూటమి పార్టీల నేతలు ఎగబడ్డారు. తటస్థులు, వ్యాపారవేత్తలు పోటీ పడ్డారు. ఈ క్రమంలో కూటమికి చెందిన ప్రధాన నాయకుడి కనుసన్నల్లో రెండు ఆలయాల కమిటీల నియామకం కోసం ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను దేవాదాయశాఖకు పంపారు. బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ ఖరారు కాగా, చివరి క్షణంలో చింతల వేంకటరమణస్వామి దేవాలయానికి సంబంధించిన కమిటీ ఎంపికపై సందిగ్ధం నెలకొంది. చివరి క్షణంలో బీజేపీకి చెందిన మద్దతుదారుని స్థానంలో అదే పార్టీకి చెందిన మరొకరిని ఎంపిక చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కొత్త కమిటీ ఎంపిక కోసం నోటిఫికేషన్‌ జారీ చేసి ఆరు నెలలు దాటినా... నేటికీ నియామకం కాకపోవడంతో ఆశావహుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.

తాత్కాలిక కమిటీతోనే ఉత్సవాలు

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చింతల వేంకటరమణస్వామి ఉత్సవాలను తాత్కాలిక కమిటీతోనే నెట్టుకొస్తున్నారు. ఈ కమిటీలోని సభ్యుల్లో ఎక్కువ మంది అధికారిక కమిటీలో స్థానం కోసం ఎదురు చూస్తున్నవారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో అధ్యక్ష స్థానాన్ని ఆశించిన వారు ఉత్సవాలకు అవసరమైన విరాళాల సేకరణలో ముందు వరసలో నిలిచి రూ. లక్షలు సేకరించారు. రెండేళ్లుగా జరిగిన అన్ని ఉత్సవాల్లోనూ విరాళాల సేకరణతోపాటు వాటి నిర్వహణకు తీవ్ర స్థాయిలో శ్రమించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఖర్చుతో ఉత్సవాలను నిర్వహించారు. ఇలాంటి తరుణలో ఆలయ కమిటీ నియాకంపై నోటిఫికేషన్‌ జారీ కాకపోవడంతో అందరిలోనూ నిరాశ వ్యక్తమవుతోంది.

నిర్వహణ గాలికి

దేవదాయశాఖ ఈఓ రామాంజనేయులుకు తాడిపత్రిలోని రెండు దేవాలయాలకు రెగ్యులర్‌ పోస్టు కాగా, అనంతపురం, రాప్తాడు గ్రూపు దేవాలయాలకు ఇన్‌చార్జ్‌ వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన తాడిపత్రిలోని ఆలయాల నిర్వహణను గాలికి వదిలేసినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పూజల ఖర్చులు, ఆలయాల పరిశుభ్రత తదితర అంశాలను ఏమాత్ర పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఆలయాలు ఆదాయాన్ని కోల్పోయతున్నాయని వాపోతున్నారు.

తాడిపత్రిలోని చింతల వేంకటరమణస్వామి ఆలయం

త్వరలో నోటిఫికేషన్‌

చింతల వేంకటరమణస్వామి దేవాలయానికి సంబంధించిన నూతన కమిటీ నియామకం కోసం త్వరలో దేవదాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. గత ఏడాది ఆగస్టులో నోటిఫికేషన్‌ జారీ చేసినా కొన్ని అనివార్య కారణాల వల్ల కమిటీ ఏర్పాటు కాలేదు.

– రామాంజనేయులు, ఈఓ, దేవదాయశాఖ

Advertisement
 
Advertisement
Advertisement