రాయదుర్గం టౌన్: స్థానిక కోతిగుట్ట వద్ద కుక్కల దాడిలో ఓ జింక తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. నీటి కోసం సమీప అటవీ ప్రాంతం నుంచి శుక్రవారం కోతిగుట్ట వద్దకు వచ్చిన జింకను ఒక్కసారిగా కుక్కలు చుట్టుముట్టాయి. దీంతో జింక పరుగున సమీపంలోని నర్సరీలోకి చేరుకుంది. గమనించిన స్థానికులు వెంటనే కుక్కలను అదిలించి జింకను కాపాడారు. సమాచారం అందుకున్న అటవీ అధికారి దామోదరరెడ్డి అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన జింకను వెంటనే స్థానిక పశువైద్యశాలకు తీసుకెళ్లారు. డాక్టర్ నవీన్ చికిత్సలు అందజేసినా ఫలితం దక్కలేదు. కుక్కలు చుట్టుముట్టి దాడి చేయడంతో భయంతో గుండెపోటుకు గురై జింక మృతి చెందినట్లు వైద్యాధికారి నిర్ధారించారు.
పశు శాఖలో
కొనసాగిన విచారణ
అనంతపురం అగ్రికల్చర్: పశు సంవర్ధకశాఖలో చోటు చేసకున్న రూ.కోటికి పైగా నిధుల గోల్‌మాల్ అంశంపై స్థానిక షీప్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో శుక్రవారం విచారణ చేపట్టారు. అభియోగాలకు సంబంధించిన పత్రాలను విచారణాధికారిగా వచ్చిన అన్నమయ్య జిల్లా జేడీ డాక్టర్ గుణశేఖర్ పిళ్‌లై మరో ముగ్గురు అధికారుల బృందం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ శాఖ విశ్రాంత జేడీ డాక్టర్ జీపీ రవికుమార్, సస్పెన్షన్‌కు గురైన సీనియర్ అసిస్టెంట్ సుశీల వ్యక్తిగతంగా హాజరై లిఖిత పూర్వక వాంగ్మూలం ఇచ్చారు.
విచారణకు హాజరైన ఏడీఏ
అనంతపురం అగ్రికల్చర్: తనపై వచ్చిన వివిధ రకాల ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఏడీఏ జీఎం అల్తాఫ్ అలీఖాన్ శుక్రవారం విచారణాధికారి ఎదుట హాజరయ్యారు. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో రెండో రోజూ విచారణ కొనసాగింది. కమిషనరేట్ నుంచి వచ్చిన జేడీఏ కృపాదాస్, ఏడీఏ ప్రేమశేఖర్, ఏఓ సురేష్ బృందం గంట పాటు అల్తాఫ్ అలీఖాన్‌ను విచారణ చేశారు. శిథిలావస్థకు చేరుకున్నందున అనుమతి లేకుండా డివిజన్ కార్యాలయాన్ని మార్పు చేసినట్లుగా వివరించారు. అనంతరం అభియోగాలు, ఆరోపణలకు సంబంధించి వివరాలు, లిఖిత పూర్వక వాంగ్మూలం తీసుకున్నారు. అలాగే అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం ఏఓలు, ఏడీఏ కార్యాలయ టెక్నికల్ ఏఓ, సిబ్బందిని కూడా విచారించి వివరాలు తీసుకున్నారు. అనంతరం శిథిలావస్థకు చేరుకున్న డివిజన్ కార్యాలయంతో పాటు ఎరువుల ప్రయోగశాల (ఎఫ్‌సీఓ)ను విచారాణాధికారులు పరిశీలించారు. రెండు రోజుల పాటు పదుల సంఖ్యలో డీలర్లు, అధికారుల నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు, దీనికి సంబంఽధించి సమగ్ర నివేదిక ఉన్నతాధికారులకు సమర్పిస్తామని విచారణాధికారి కృపాదాస్ తెలిపారు.
రైల్వే విశ్రాంత
ఉద్యోగిపై కోతి దాడి
గుత్తి: స్థానిక తురకపల్లి మార్గంలో శుక్రవారం ఉదయం రైల్వే విశ్రాంత ఉద్యోగి డేవిడ్‌పై ఉన్నఫళంగా ఓ కోతి దాడి చేసి కరిచింది. తీవ్రంగా గాయపడిన డేవిడ్‌ను కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
మహిళపై దాడి
గుత్తి: బాకీ డబ్బులు చెల్లించాలని నిలదీసిన మహిళపై వ్యక్తి దాడి చేసిన ఘటన గుత్తిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో నివాసముంటున్న మహాలక్ష్మి నర్సరీ నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో గుంతకల్లు మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన నారాయణ గత ఏడాది నర్సరీలో రూ.70 వేల విలువైన మొక్కలు కొనుగోలు చేశాడు. ఈ మొత్తాన్ని తర్వాత ఇస్తానంటూ ముఖం చాటేశాడు. అప్పటి నుంచి పలుమార్లు మహాలక్ష్మి అడిగినా రేపో.. మాపో అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. శుక్రవారం ఉదయం గుత్తిలో నారాయణ కనిపించడంతో బాకీ డబ్బు చెల్లించాలంటూ మహాలక్ష్మి నిలదీసింది. ఆ సమయంలో మహిళ అని కూడా చూడకుండా దుర్బాషలాడుతూ ఆమైపె నారాయణ దాడికి పాల్పడ్డాడు. స్థానికులు కల్పించుకుని సర్దిచెప్పి మహాలక్ష్మిని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


