‘ఉపాధి’పై కేంద్రం కుట్ర | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’పై కేంద్రం కుట్ర

Apr 11 2026 8:34 AM | Updated on Apr 11 2026 8:34 AM

కార్పొరేట్ల కోసమే వీ బీజీ రాం జీ

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య

రాప్తాడు రూరల్‌: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శించారు. కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేయడానికే ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచి, వీ బీజీ రాం జీ వంటి కొత్త విధానాలను అమలు చేస్తోందని మండిపడ్డారు. ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలంటూ సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనంతపురం రూరల్‌ మండలం సమతాగ్రాం నుంచి నార్పల మండలం బండ్లపల్లి వరకు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రామకృష్ణ, ఈశ్వరయ్య మాట్లాడారు. ఉపాధి చట్టాన్ని హక్కుగా కాకుండా ఒక సాధారణ స్కీమ్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ పథకం అమలులో ప్రస్తుతం కేంద్రం వాటా 60 శాతానికి తగ్గించి, రాష్ట్రంపై 40 శాతం భారం మోపడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే పనులు నిలిచిపోతాయని, తద్వారా పథకం నిర్వీర్యం అయ్యేలా కేంద్రం కుట్ర పన్నిందని ఆరోపించారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి, నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, గుల్జార్‌సింగ్‌ గురియా, నిర్మల్‌, రావుల వెంకయ్య, జాఫర్‌, ఆవుల శేఖర్‌, బండి వెంకటేశ్వరరావు, వేమయ్య, మల్లికార్జున, రాజారెడ్డి, వలరాజు, నాసర్‌, సంతోష్‌కుమార్‌, యుగంధర్‌, చంద్రనాయక్‌, సంజీవప్ప, శ్రీరాములు, పద్మావతి, రమేష్‌, రాజేష్‌, రమణయ్య, లింగమయ్య, కుల్లాయిస్వామి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement