బత్తలపల్లి: మండలంలోని డి.చెర్లోపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పాలమసి నారాయణస్వామి(59) గుండెపోటుతో మరణించారు. అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి సమీపంలోని బాలాజీ హౌసింగ్ కాలనీలో నివాసముంటున్న ఆయన గురువారం రాత్రి గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం మరణించారు. కాగా, నారాయణస్వామికి భార్య లక్ష్మి, ఓ కుమారుడు ఉన్నారు. నారాయణస్వామి మృతి చెందిన విషయం తెలియడంతో ఎంఈఓ సుధాకర్‌నాయక్‌తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహచర ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అనంతపురానికి తరలివెళ్లారు. నారాయణస్వామి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు.


