కళ్యాణదుర్గం రూరల్: విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బళ్లారి జిల్లా మోకా సమీపంలోని సింధవాళం గ్రామానికి చెందిన బసవరాజు (32)కు భార్య ఛైత్ర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో మొక్కజొన్న పంట కోతకు మిషన్ కూలీగా వచ్చాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కోత మిషన్ పైకి ఎక్కి యంత్రాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై కిందకు పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై కళ్యాణదుర్గ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
టీచర్‌పై దళిత నేత దాడి
పామిడి: ఉపాధ్యాయుడిపై ఓ దళిత నేత దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పామిడి గ్రామానికి చెందిన కృష్ణారావు బొమ్మనహాళ్ మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పామిడిలోని తన ప్లాట్‌ను విక్రయానికి పెట్టారు. ఈ విషయంగా దళిత నేత, ఎదురూరు గ్రామానికి చెందిన తూర్పింటి మల్లికార్జునతో విభేదాలు తలెత్తాయి. దీంతో కక్ష కట్టిన మల్లికార్జున గురువారం మధ్యాహ్నం చికిత్స కోసం స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రికి చేరుకున్న ఉపాధ్యాయుడు కృష్ణారావుపై దాడికి తెగబడ్డాడు. బాఽధిత టీచర్ కృష్ణారావు ఫిర్యాదు మేరకు మల్లికార్జునపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పులి మాస్క్ ధరించి చోరీ
పామిడి: అరవై నాలుగు కళల్లో దొంగతనం కూడా ఓ కళ అని నిరూపించాడు ఓ దొంగ. పోలీసులను తప్పుదోవ పట్టించేలా ఏకంగా పులి మాస్క్ ధరించి దుకాణంలో చొరబడి నగదుతో పాటు విలువైన వస్తువులను అపహరించుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే... పామిడిలోని మెయిన్ బజార్‌లో రఫీ అనే వ్యక్తి జీఎస్‌ఆర్ పేరుతో జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. గత 15 రోజులుగా దుకాణంలోని వస్తువులు, నగదు మాయమవుతుండడాన్ని గమనించిన ఆయన ఇటీవల సీసీ కెమెరాలను అమర్చాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న రాత్రి మరోసారి చోరీ జరిగింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన దుకాణదారుడు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి అవాక్కయ్యాడు. పాతికేళ్ల లోపు వయసున్న యువకుడు రెయిన్‌కోట్ ధరించి, ముఖానికి పులి మాస్క్‌తో దుకాణంలో తిరుగాడుతూ విలువైన సరుకులు, నగదు అపహరించడాన్ని గమనించి విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ శివశంకరనాయక్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తలసేమియా
కేంద్రం ప్రారంభం
అనంతపురం: నగరంలోని పాతూరులో ఉన్న ప్రభుత్వాస్పత్రి ఆవరణలో రెడ్‌క్రాస్ తలసేమియా డే కేర్ సెంటర్‌ను డీఆర్వో మలోల గురువారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెడ్‌క్రాస్ చైర్మన్ ఈ.రామారావు, రాష్ట్ర వైస్ చైర్మన్ రామచంద్ర రాజు, అనంతపురం జిల్లా చైర్మన్ కాపు భారతి, జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్ పాల్గొన్నారు. రెడ్‌క్రాస్ తలసేమియా కేంద్రానికి ఆర్థిక, వస్తు సాయం చేసిన దాతలు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన తలసేమియా బాధిత చిన్నారులు, వారి తల్లిదండ్రులు, రక్తదాన శిబిర నిర్వాహకులు, వివిధ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, విద్యార్థులు, సమాజ సేవకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ.రామారావు మాట్లాడుతూ... తలసేమియా బాధిత చిన్నారులకు సేవ చేయడమనేది అతిపెద్ద మానసిక ప్రశాంతత కలిగించే కార్యక్రమమన్నారు. రెడ్‌క్రాస్ కాకినాడ తలసేమియా కేంద్రంలో రక్త మార్పిడి చేసుకుంటున్న పిల్లల్లో కొందరు ఉన్నత విద్యాభ్యాసం సాగిస్తున్నారని గుర్తు చేశారు. రామచంద్రరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర శాఖ తరపున త్వరలో ఇంపోర్టెడ్ లింబ్స్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తలసేమియా కేంద్రం చాలా బాధ్యతతో కూడుకున్న కార్యక్రమమని జిల్లాలో ప్రముఖ పిల్లల డాక్టర్లు శ్రీనివాసులు, రఘువంశీ వంటి వారు ఈ కేంద్రంలో సేవా చేయటానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభ పరిణామం అని కొనియాడారు. డీఆర్వో మలోల మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. జన్యు సంబంధిత తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు రెడ్‌క్రాస్ రక్త మార్పిడి, మందులు, ఇతరత్రాలను పూర్తి ఉచితంగా అందించేలా ప్రణాళిక చేయటం చాలా సంతోషకరమన్నారు.


