కణేకల్లు: చిక్కణ్ణేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ మైదానంలో గురువారం దున్నపోతుల రాతి దూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. పోటీలకు మొత్తం ఏడు జతల దున్నపోతులను రైతులు తీసుకువచ్చారు. ఉదయం 10 నుంచి సాయంకాలం వరకూ సాగిన ఈ పోటీల్లో రైతు దాదాకు చెందిన దున్నపోతులు మొదటి స్థానాన్ని దక్కించుకున్నాయి. అలాగే రైతు కురబ నాగరాజు దున్నపోతులు ద్వితీయ స్థానం, రైతు లాలుస్వామి దున్నపోతులు మూడో స్థానంలో నిలిచాయి. విజేత దున్నపోతుల యజమానులను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ చంద్రమౌళి, జూనియర్ అసిస్టెంట్ మారుతి, మాజీ వైస్ సర్పంచ్ ఆనంద్, మార్కెట్ యార్డు డైరెక్టర్ చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
యూపీఎస్‌సీ ఫ్లాగ్ షిప్ పరీక్ష రేపు
అనంతపురం అర్బన్: ఈ నెల 12న జిల్లాలోని రెండు కేంద్రాల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగే ప్లాగ్ షిప్ (ఎన్‌డీఏ, ఎన్‌ఏ, సీడీఎ) పరీక్షలకు 522 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, నిర్వహణ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. పరీక్షల నిర్వహణపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాల కేంద్రంలో కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ–1 (సీడీఎ) పరీక్ష మూడు సెషన్లుగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 6 గంటల వరకు జరుగుతుందన్నారు. కేఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో నేషనల్ డిఫెన్స్ ఆకాడమీ (ఎన్‌డీఏ), నావెల్ అకాడమీ–1(ఎన్‌ఏ) పరీక్ష రెండు సెషన్లుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుందన్నారు. ఇన్‌స్పెక్టింగ్ అధికారులుగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు టి.పద్మావతి, రామ్మోహన్, రూట్ అధికారులుగా డ్వామా పీడీ సలీమ్‌బాషా, మైనార్టీ సంక్షేమాధికారి రామసుబ్బారెడ్డి వ్యవహరిస్తారన్నారు. ప్రశ్నపత్రాలకు కస్టోడియన్‌గా డీఆర్వో మలోల ఉంటారన్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిర్ధేశించిన పరీక్ష సమయానికి కంటే గంట ముందే చేరుకోవాలని, అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు.


