వేంకటేశా.. గోవిందా | - | Sakshi
Sakshi News home page

వేంకటేశా.. గోవిందా

Apr 8 2026 7:20 AM | Updated on Apr 8 2026 7:20 AM

వజ్రకరూరు: భక్తుల కొంగు బంగారం జనార్దన వేంకటేశ్వర స్వామి రథోత్సవం మంగళవారం వజ్రకరూరులో అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం మడుగుతేరు భక్తిశ్రద్ధలతో చేపట్టారు. భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు. సాయంత్రం రథం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై కొలువుదీర్చి ఉత్సవాన్ని ప్రారంభించారు. భక్తుల నమో వేంకటేశా.. గోవిందా, గోవింద నామస్మరణల నడుమ స్వామివారి రథోత్సవం కనులపండువగా సాగింది. ఆలయం నుంచి రథాన్ని మెయిన్‌ రోడ్డులో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వరకు లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు. రథంపై భక్తులు పండ్లు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో పురవీధులు ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయాయి. స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్‌దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉరవకొండ సీఐ మహానంది ఆధ్వర్యంలో ఎస్‌ఐలు జనార్దన్‌ నాయుడు, ఖాజాహుసేన్‌, మురహరి, ఏఎస్‌ఐ రమేష్‌ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ అంగదాల క్రిష్ణయ్య, గుమస్తా లాలేష్‌, ఆలయ ప్రధాన అర్చకుడు నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా జనార్దన వేంకటేశ్వర స్వామి రథోత్సవం

భక్తులతో కిక్కిరిసిన వజ్రకరూరు

Advertisement
 
Advertisement
Advertisement