నరసింహ స్వామికే ‘పచ్చ’ టోపీ! | - | Sakshi
Sakshi News home page

నరసింహ స్వామికే ‘పచ్చ’ టోపీ!

Apr 8 2026 7:20 AM | Updated on Apr 8 2026 7:20 AM

కదిరి: బీజేపీతో కలిసున్న పచ్చ పార్టీ నేతలు మనుషులనే కాదు..చివరికి దేవున్ని కూడా మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. తమ స్వార్థం కోసం స్వామివారికి రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండి కొడుతూ శ్రీవారికే కుచ్చు(పచ్చ)టోపీ పెట్టాలని చూశారు. చేసేది లేక చివరకు స్వామి ముందు తలవంచక తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వెలసిన ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సంబంధించిన కొబ్బరి కాయల బహిరంగ వేలం మంగళవారం ఆలయ ప్రాంగణంలో జరిగింది. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎంఎస్‌ పార్థసారథి అనుచరుడు గంగాధర్‌ బహిరంగ వేలంలో పాల్గొని రూ 27.20 లక్షలకు పాట పాడాడు. ఇదే పార్టీకి చెందిన రామచంద్ర అలియాస్‌ లడ్డు చంద్ర రూ.25లక్షలు, మరో వ్యక్తి తలుపుల రమణ రూ.26 లక్షల దగ్గర తమ వేలం పాటను ఆపేశారు. అదే సమయంలో ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి, దేవదాయ శాఖ జిల్లా ఇన్‌స్పెక్టర్‌ సమక్షంలో అందరి ముందు సీల్డ్‌ టెండర్‌ తెరిచారు. అందులో బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు విష్ణువర్దన్‌రెడ్డి అనుచరుడు చంటి అనే వ్యక్తి అత్యధికంగా రూ.31.21 లక్షలకు తన టెండర్‌ దాఖలు చేశాడు. ఇతను హెచ్చుపాటదారుడు కావడంతో టెండర్‌ ఇతనికే కట్టబెడుతున్నట్లు ఆలయ ఈఓ అందరి ముందు ప్రకటించాడు. వెంటనే ఆయన ఆలయ అధికారులు సూచించిన బ్యాంకుకెళ్లి ఆ మొత్తం డబ్బుకు డీడీ తీసుకొచ్చి ఈఓ చేతికి అందజేయాలని వచ్చాడు.

ఎమ్మెల్యే ఒత్తిడితో సీన్‌ రివర్స్‌

గత కొంత కాలంగా బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డికి, టీడీపీ స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో విష్ణును రథంపైకి రాకుండా ఎమ్మెల్యే అతన్ని పోలీసులకు చెప్పి హౌస్‌ అరెస్ట్‌ చేయించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం విష్ణు అనుచరుడు కొబ్బరి కాయల టెండర్‌ దక్కిందని తెలిసి ఎమ్మెల్యే కోపంతో ఊగిపోయాడు. వెంటనే ఆలయ ఈఓపై ఒత్తిడి తెచ్చాడు. ఎలాగైనా అతనికి కాకుండా తక్కువ ధరకే పాడిన గంగాధర్‌కు ఇవ్వాలని, లేదంటే వాయిదా వేయాలని ఆదేశించాడు. దీంతో ఈఓ అడకత్తెరలో పడ్డాడు. హెచ్చు పాటదారుడు తెచ్చిన రూ.31.21 లక్షల డీడీని తీసుకోకుండా రాత్రి 8.30 గంటల వరకూ కాలయాపన చేస్తే వారు ఈఓకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. చేసేది లేక చివరకు చంటి తెచ్చిన డీడీని తీసుకోక తప్పలేదు.

కొబ్బరి కాయల టెండర్‌లో కూటమి కుట్ర

రూ. 31.21 లక్షలకు పాడిన చంటి

రూ. 27.21 లక్షలతో పాట ఆపేసిన గంగాధర్‌

గంగాధర్‌కే ఆ టెండర్‌ ఇవ్వాలని ఎమ్మెల్యే ఒత్తిడి

అడకత్తెరలో ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement