బాధ్యత మరిచిన బోధకులు | - | Sakshi
Sakshi News home page

బాధ్యత మరిచిన బోధకులు

Apr 7 2026 8:01 AM | Updated on Apr 7 2026 8:01 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: పదో తరగతి వంటి కీలక పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే మలుపుగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియ అత్యంత బాధ్యతగా, నిష్పక్షపాతంగా జరగాలి. అయితే ప్రస్తుతం మూల్యాంకన విధులకు టీచర్లు ఆసక్తి చూపకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మూల్యాంకనం కేంద్రాల్లో కూర్చోవాల్సి వస్తుందనే భావనతో కొంతమంది ఉపాధ్యాయులు ఈ విధులను తప్పించుకోవాలని చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్కూల్‌ డ్యూటీ అయితే మధ్యాహ్నానికే పూర్తవుతుందనే భావనలో ఉన్నారు. మూల్యాంకనం వంటి కీలక బాధ్యతల పట్ల నిర్లక్ష్యం చూపడం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. సోమవారం అనంతపురంలోని కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల పాఠశాలలో మూల్యంకన ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా... రకరకాల సమస్యల కారణంగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. జిల్లా పరిశీలకులు జేడీ సుబ్బారావు పర్యవేక్షణలో డీఈఓ ప్రసాద్‌బాబు ఆధ్వర్యంలో మూల్యాంకనం మొదలైంది. ఎక్కువమంది టీచర్లు విధుల నుంచి తప్పించుకునేందుకు ఆసక్తి చూపారు. ఫలితంగా మూల్యాంకనం ప్రారంభమైనప్పటికీ ఇంకా 120 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు (ఏఈలు), 70 మంది స్పెషల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ) అవసరమవుతోందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డీఈఓ, టెక్నికల్‌ సిబ్బంది పదేపదే చెబుతున్నా.. లేని రోగాలను తెరపైకి తెస్తూ కొందరు, బోధనలో అనుభవం ఉన్నా లేదంటూ మరికొందరు ఆర్డర్లు రద్దు చేయించుకున్నారు. అయితే వారు ప్రత్యామ్నాయంగా ఆసక్తి ఉన్నవారి పేర్లు ఇచ్చి ఉంటే పెద్ద సమస్య ఉండేది కాదు. కానీ ఆర్డర్లు రద్దు చేయించుకుని.. ప్రత్యామ్నాయ టీచర్లను చూపకుండా చేతులు దులుపుకోవడంతో సమస్య జఠిలంగా మారింది. విద్యార్థులు ఏడాది పొడవునా కష్టపడి చదివి రాసిన పరీక్షలకు న్యాయం జరగాలంటే ప్రతి టీచరూ తన బాధ్యత గుర్తించాలి. మూల్యాంకనం కేవలం ఉద్యోగ విధి మాత్రమే కాదు, అది ఒక నైతిక బాధ్యతగా భావించాలి. ప్రతి జవాబు పత్రం వెనుక ఒక విద్యార్థి కృషి, ఆశలు, కలలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి.

సతాయించిన సర్వర్‌

మరోవైపు సర్వర్‌ సతాయించడం, అవగాహన లేకపోవడం కారణంగా మార్కుల ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. లీప్‌ యాప్‌ను అటెండెన్స్‌తో పాటు మూల్యంకనం విధులకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేమారు ఉపయోగించడంతో అధికలోడు కారణంగా సాంకేతిక సమస్య ఏర్పడింది. ఒకటి స్కానింగ్‌ చేస్తే మరొకటి స్కానింగ్‌ అవ్వడంతో ఎస్‌ఏలు తలలు పట్టుకున్నారు. ముందుగా కంట్రోల్‌ బండిల్‌ స్లిప్‌ను స్కాన్‌ చేయాల్సి ఉంది. తర్వాత బండిల్‌లో ఉన్న 20 జవాబుపత్రాల స్కానింగ్‌ చేసేందుకు ఆప్షన్‌ వస్తుంది. ఆ తర్వాత ప్రశ్నల వారీగా మార్కుల నమోదు ఆప్షన్‌ వస్తుంది. తర్వాత మార్కులన్నింటికీ నమోదు చేసి.. చివరగా సబ్‌మిట్‌ కొడితే ఆ బండిల్‌ పూర్తవుతుంది. అయితే సర్వస్‌ సమస్య తలెత్తి ఆటంకం కల్గింది. దీనికితోడు తొలిసారి ఆన్‌లైన్‌ విధానం కావడంతో అవగాహన లేని ఎస్‌ఏలు మార్కుల నమోదుకు ఆపసోపాలు పడ్డారు. ప్రతి స్పెషల్‌ అసిస్టెంటూ రోజుకు 80 జవాబుపత్రాల మార్కులను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. తొలిరోజు కొందరు ఎస్‌ఏలు పడిన ఇబ్బందులను చూసిన ఏఈలు, సీఈలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మార్కుల అప్‌లోడ్‌లో ఎదరువుతున్న సమస్యలను పరిష్కరిస్తే మూల్యంకనం సజావుగా జరిగే వీలుంటుందని పేర్కొన్నారు. పరిశీలకులు సుబ్బారావు, డీఈఓ ప్రసాద్‌బాబు మాట్లాడుతూ తొలిరోజు చిన్నచిన్న సమస్యలు ఎదురయ్యాయన్నారు. రెండోరోజుకంతా సద్దుమణుగుతాయన్నారు. ఏఈలు, స్పెషల్‌ అసిస్టెంట్ల విధులను బాధ్యతగా తీసుకోవాలన్నారు. అందరూ సహకరించాలని కోరారు.

మార్కుల నమోదుకు ఇబ్బందులు పడుతున్న టీచర్లు స్పాట్‌ వాల్యుయేషన్‌ విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు

పేపర్లు దిద్దేందుకు అనాసక్తి

‘పది’ మూల్యాంకనం మధ్యాహ్నం ప్రారంభం

ఇంకా 120 మంది ఏఈలు, 70 మంది స్పెషల్‌ అసిస్టెంట్లు అవసరం

తొలిరోజు మొరాయించిన ట్యాబ్‌లు.. మార్కుల అప్‌లోడ్‌కు తీవ్ర ఆటంకం

నేటి నుంచి సమస్యలు అధిగమిస్తామంటున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement