● సీఎం సభావేదిక సమీపంలో అంబులెన్స్‌లో ఎదురుచూపు
● సీఎంని కలిసేందుకు ప్రయత్నించి నిరాశతో వెనక్కు
యాడికి: తన కుమారుడి దీనస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యక్షంగా తెలియజేసి సాయం కోరుదామని వచ్చిన అభాగ్యుడి తండ్రికి నిరాశే ఎదురైంది. అధికార పార్టీ నేతల సూచన మేరకు యాడికిలోని ‘ప్రజా వేదిక’ సమీపానికి అంబులెన్స్ సాయంతో కుమారుడిని తీసుకొచ్చినా.. సీఎం వద్దకు వెళ్లేందుకు అవకాశమివ్వలేదు. నాయకులు సైతం వారిని తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. మా మొర ఆలకించేవారే లేరా అంటూ కంటతడి పెట్టుకుని వెనుదిరిగిపోయారు. రాయలచెరువు గ్రామానికి చెందిన శ్రీనివాసులునాయుడు కుమారుడు రవికుమార్ నాయుడు (25) నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పటి నుంచి మంచానికే పరిమితమైపోయాడు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బాధితుడు రవికుమార్ నాయుడి ఇంటికెళ్లి పరామర్శించి, రూ.50 వేల ఆర్థిక సాయం చేశారు. రవికుమార్‌నాయుడుకు రూ.6 వేల పింఛన్ వస్తోందని, మంచానికి పరిమితమైనందున రూ.15 వేల పింఛన్‌గా మార్పు చేయాలని ప్రస్తుత టీడీపీ మండల సీనియర్ నాయకుడిని శ్రీనివాసులునాయుడు కోరాడు. సోమవారం యాడికిలో బహిరంగ సభకు సీఎం వస్తున్నారని, అక్కడికి కుమారుడిని తీసుకువస్తే సీఎంకు చూపించి రూ.15 వేలు పింఛన్ వచ్చేటట్లు చేస్తామని సీనియర్ నాయకుడు సూచించాడు. ఈ మేరకు శ్రీనివాసులునాయుడు కుమారుణ్ని తీసుకొచ్చి తన భార్యతో కలిసి అంబులెన్స్‌లో యాడికిలోని సభా ప్రాంగణం ఎదుట వేచి ఉన్నాడు. అయితే సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 2 గంటలు అవుతున్నా వారి గురించి పట్టించుకోలేదు. అంబులెన్స్‌లో నుంచి రవికుమార్‌నాయుడును సీఎం వద్దకు తీసుకెళ్తుంటే ప్రత్యేక భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఇక అధికార పార్టీ నేతలు కూడా వారిని సీఎం వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాసులు నాయుడు అదే అంబులెన్స్‌లో రవికుమార్‌ను స్వగ్రామానికి తీసుకెళ్లిపోయాడు.


