అనంతపురం అగ్రికల్చర్: భానుడు భగ్గుమంటున్నాడు. మండే ఎండలతో జనానికి ముచ్చెటమలు పట్టిస్తున్నాడు. జిల్లా అంతటా 39 నుంచి 41 డిగ్రీలతో సుర్రుమనిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో తొలిసారిగా సోమవారం తాడిపత్రిలో 41.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానురాను ఉష్ణోగ్రతలు మరింత పెరిగే పరిస్థితి ఉందని వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండబారి నుంచి కాపాడుకునేందుకు ఏప్రిల్, మే నెలల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 22 నుంచి 27 డిగ్రీల మధ్య ఉక్కపోత కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకే ఎండ ప్రభావం మొదలై సాయంత్రం 5 వరకు వేడి కొనసాగుతోంది. వడగాల్పులు, ఉక్కపోత అధికంగా ఉండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లడం మంచిదికాదని సూచిస్తున్నారు.


