రాప్తాడు రూరల్: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో రాప్తాడు మండలం ఎం. చెర్లోపల్లి మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు కపాడం నాగన్న (60) దుర్మరణం పాలయ్యారు. ఆదివారం రాత్రి 7.45 గంటల సమయంలో మరూరు నుంచి బైకుపై బయలుదేరిన ఆయన ఊరు దాటగానే నియంత్రణ కోల్పోవడంతో బైకు అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలో పడింది. ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో భార్య తన బంధువుల సాయంతో మరూరుకు వెళ్లి ఆరా తీసింది. అప్పటికే ఇంటికి వెళ్లాడని అక్కడి వారు తెలపడంతో ఆందోళనతో గాలింపు చేపట్టారు. చీకటిలో గుంతలో పడిపోయిన నాగన్నను ఆలస్యంగా గుర్తించారు. కాగా, నాగన్న భార్య రామాంజనమ్మ కూడా ఎంపీటీసీ సభ్యురాలిగా పని చేశారు. సోమవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, గంగుల సుధీర్‌రెడ్డి, మండల కన్వీనర్లు సాకే వెంకటేష్, రామగిరి మీనుగ నాగరాజు, యూత్ కన్వీనర్ విశ్వనాథరెడ్డి, నాయకులు ఎం. చెన్నారెడ్డి, బుడగ నాగరాజు, బుడగ లక్ష్మీనారాయణ, రామచంద్రారెడ్డి, నడిమిదొడ్డి వరదప్ప, మిడతల ఆది, చుక్కా సంజీవరాయుడు సింగారప్ప, బారక ముసలప్ప, రిటైర్డ్ టీచర్ కపాడం బాబు, సాకే శ్రీకృష్ణ, పసుపుల శేఖర్ తదితరులు నాగన్న మృతదేహం వద్ద నివాళులర్పించారు.


