యాడికి: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. యాడికి మార్కెట్ యార్డులో నిర్వహించే ప్రజావేదికలో పాల్గొంటారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజా వేదిక వద్ద స్టాల్స్ ఏర్పాటు చేశారు. హై స్పీడ్ ఇంటర్నెట్, పార్కింగ్ ఏర్పాట్లలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.ఉదయం 11.10 గంటలకు సీఎం యాడికి మండలం వేములపాడు గ్రామంలో కేజీబీవీ సమీపాన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి ప్రజా వేదిక వద్దకు చేరుకుంటారు. 11.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అక్కడి కార్యక్రమంలో పాల్గొంటారు. 1.40 నుంచి 2.30 గంటల వరకు జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకొని అనంతరం తాడేపల్లికి బయల్దేరుతారు.
వాహనాల రాకపోకల మళ్లింపు
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మండలంలోని వేములపాడు క్రాస్ మీదుగా యాడికి – వేములపాడుకు వెళ్లే వాహనాల రాకపోకలు మళ్లించినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి సీఎం పర్యటన ముగిసే వరకు అనుమతి లేదన్నారు. గుత్తి నుంచి రాయలచెరువు, పెద్దపేట మీదుగా యాడికి, కర్నూలు జిల్లాకు వెళ్లే వాహనాలు, సిమెంట్ లారీలు రాయలచెరువు మీదుగా 67వ జాతీయ రహదారిపై తాడిపత్రికి వెళ్లాలి. బుగ్గ, తాడిపత్రి నుంచి గుత్తి వైపు వెళ్లే వాహనాలు కూడా 67వ జాతీయ రహదారి గుండా వెళ్లాలి. యాడికిలోకి అనుమతి లేదని సీఐ తెలిపారు. సీఎం సభకు గుత్తి వైపు నుంచి యాడికికి వెళ్లే వాహనాలు రాయల చెరువు పెద్దపేట మీదుగా వెళ్లవచ్చు. తాడిపత్రి బుగ్గ వైపు నుంచి మీటింగ్‌కు వచ్చే వాహనాలు చీమలవాగుపల్లి మీదుగా చేరుకోవచ్చని సీఐ తెలిపారు.
నేడు డయల్ యువర్
ఎస్పీడీసీఎల్ సీఎండీ
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు సెల్ నంబర్ 8977716661కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు.
జిల్లాలో డయల్ యువర్ ఎస్‌ఈ..
అనంతపురం జిల్లాలో డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు ఫోన్ నంబర్ 9154790350లో ఫిర్యాదు చేయాలని కోరారు.
7న మహిళా విభాగం
విస్తృతస్థాయి సమావేశం
అనంతపురం టౌన్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో మహిళలపై హత్యలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని, మహిళలపై చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈనెల 7న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బి.శ్రీదేవి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో మహిళా విభాగం నేతలతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయమనోహరితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంటరామిరెడ్డి హాజరవుతారన్నారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, మహిళా నేతలు రాధయాదవ్, భారతి, శోభారాణి, క్రిష్ణవేణి పాల్గొన్నారు.
మలిదశ పోరాటాన్ని
విజయవంతం చేయండి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ, పెన్షనర్ల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో చేపడుతున్న మలిదశ పోరాటాన్ని విజయవంతం చేయాలని జిల్లా చైర్మన్ శ్రీనివాస్ నాయక్, సెక్రటరీ జనరల్ పురుషోత్తం పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ విధులకు హాజరుకావాలని తెలిపారు. ఈ నెల 9న మూల్యాంకన కేంద్రం వద్ద నిరసన, 25, 26, 27 తేదీల్లో విజయవాడలో రిలే నిరాహార దీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.


