సాంకేతికతపై పట్టు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

సాంకేతికతపై పట్టు సాధించాలి

Mar 29 2026 7:10 AM | Updated on Mar 29 2026 7:10 AM

విద్యార్థులకు ఎస్‌ఆర్‌ఐటీ కరస్సాండెంట్‌ ఆలూరి సాంబశివారెడ్డి సూచన

బుక్కరాయసముద్రం: నానాటికీ పెరిగిపోతున్న సాంకేతిక విప్లవంతో పోటీ పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఎస్‌ఆర్‌ఐటీ కరస్పాండెంట్‌ ఆలూరి సాంబశివారెడ్డి సూచించారు. బీకేఎస్‌ మండలం రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్‌)లో శనివారం సింఫనీ–2026 కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఆలూరి సాంబశివారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా శ్రీనివాస రామానుజం చిత్ర పటానికి పూల మాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. దీనికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధిస్తే ఉజ్వల భవిత ఉంటుందన్నారు. వృత్తి నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు ఉద్యోగం కల్పించే దిశగా కళాశాల యాజమాన్యం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. అనంతరం వివిధ బ్రాంచ్‌లలో సీనియర్‌ ప్రొఫెసర్లకు అవార్డులు, మెమెంటోలు, కళాశాల టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు పతకాలు, క్రీడలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానంచేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బాలకృష్ణ, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, ఐక్యూ ఏసీ డైరెక్టర్‌ డాక్టర్‌ సాయి చైతన్య కిషోర్‌, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అలరించిన సినీ తారలు

సింఫనీ–2026 కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ఇటీవల విడుదలైన బ్యాండ్‌ మేళం చిత్రం హీరో రోషన్‌, హీరోయిన్‌ శ్రీదేవి, ప్రొడ్యూసర్‌ కోణా వెంకట్‌ హాజరై, విద్యార్థులతో కలసి సందడి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో ఎస్‌ఆర్‌ఐటీ కళాశాలను చైర్‌ పర్సన్‌ జొన్నలగడ్డ పద్మావతి, కరస్పాండెంట్‌ ఆలూరి సాంబశివారెడ్డి తీర్చిదిద్దారంటూ అభినందించారు. సినీ డైలాగ్‌లతో విద్యార్థులను ఉత్తేజ పరిచారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

మాట్లాడుతున్న ఆలూరి సాంబ శివారెడ్డి నృత్యం చేస్తున్న సినీ తారలు రోషన్‌, శ్రీదేవి

డ్యాన్స్‌తో హోరెత్తిస్తున్న ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థులు, కేరింతలు కొడుతున్న విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement