● నేడు పుట్టిన రోజు.. అంతలోనే విషాదం
తాడిపత్రి రూరల్: పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ విద్యార్థి విగతజీవిగా మారాడు. స్థానికులు తెలిపిన మేరకు.. తాడిపత్రిలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన నారాయణ, మాధవి దంపతుల కుమారుడు అఖిల్ జస్వంత్‌కుమార్ (18) స్థానిక శ్రీరామ ఐటీఐలో మొదటి సంవత్సం చదువుతున్నాడు. తండ్రి లారీ డ్రైవర్‌గా, తల్లి బ్యూటీ పార్లర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి తన స్నేహితులు నాగేంద్ర, లక్ష్మీపతి, ఇంకరితో కలిసి ద్విచక్ర వాహనంపై ఈతకు వెళ్లిన అఖిల్... తిరుగు ప్రయాణంలో తేరన్నపల్లి సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా పుట్లూరు మండలం కడవకల్లుకకు చెందిన నరసింహులు, మరొకరు వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొంది. రోడ్డుపై పడిన అఖిల్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అఖిల్ స్నేహితులతో పాటు నరసింహలు, అతని స్నేహితుడూ గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న వారిని అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. కాగా, అఖిల్ పుట్టినరోజు ఆదివారం కావడంతో వేడుకలకు అంతా సిద్ధం చేసుకున్నాడని, అయితే వేడుక జరుపుకోకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లాడంటూ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. ఘటనపై తాడిపత్రి అప్‌గ్రేడ్ పీఎస్ సీఐ శివగంగాధర్‌రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
అనుమతి లేకుండా సెలవులో టీచరు
● పది రోజుల్లోపు రిపోర్ట్ చేయకపోతే తొలగిస్తామన్న డీఈఓ
అనంతపురం ఎడ్యుకేషన్: గుత్తి జెడ్పీహెచ్‌ఎస్‌లో స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శైలజ విద్యాశాఖ అనుమతి లేకుండా సెలవులో వెళ్లారు. 2024 జూలై 25 నుంచి ఆమె విదేశాల్లోనే ఉండిపోయారు. ఈ విషయం డీఈఓ ప్రసాద్‌బాబు దృష్టికి వెళ్లడంతో ఆయన ఇప్పటికే షోకాజ్ జారీ చేశారు. ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరి అవకాశంగా మరోసారి నోటీసు జారీ చేసినట్లు డీఈఓ శనివారం వెల్లడించారు. పది రోజుల్లోపు కార్యాలయానికి ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వకపోతే, సేవా నియమావళి ప్రకారం ఉద్యోగం నుంచి తొలగింపు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుదాం
● కలెక్టర్ ఆనంద్
కళ్యాణదుర్గం రూరల్: స్వచ్ఛాంధ్ర స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ శ్రమదానంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని కలెక్టర్ ఆనంద్ పిలునిచ్చారు. శనివారం మండల పరిధిలోని పాల్వాయి, వర్లి, బొట్టువానిపల్లి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. పాల్వాయి గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం పడేయరాదన్నారు. పంచాయతీ వారు ఏర్పాటు చేసిన బాక్సుల్లోనే వేయాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తాగునీటి సమస్య గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ స్పందిస్తూ నీటిసమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బొట్టువానిపల్లిలో ప్రకృతి వ్యవసాయంతో సాగుచేసిన పంటను కలెక్టర్ పరిశీలించారు.


