అనంతపురం అర్బన్: మాదకద్రవ్యాలు, గంజాయిని అరికట్టి అనంతను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ జగదీష్‌తో కలిసి నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టడంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్యార్థులకు పొగాకు ఉత్పత్తులు సరఫరా చేస్తున్న వారిపై ఫుడ్ సేఫ్టీ, పోలీసు, ఈగల్, తదితర శాఖలు కలిసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కర్ణాటక సరిహద్దు మండలాల్లో కొందరు పశువుల ఆరోగ్య కారణాల పేరుతో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు గుర్తించారన్నారు. వ్యవసాయ అధికా రులు, పోలీసులు వెళ్లి చట్టం తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. విద్యాసంస్థల్లో ప్రసంగాలతో సరిపెట్టకుండా చిత్రలేఖనం, వ్యాసరచన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని చెప్పారు. డ్రగ్స్ వాడకంతో కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసు శాఖకు లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబరు 1972కు ప్రజలు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాంటి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి, రైల్వే ఎస్పీ వెంకటేషులు, ఎకై ్సజ్ ఏఈఎస్ రేవతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


