న్యూస్‌రీల్
కూడేరు: భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. మంగళవారం కూడేరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ కేశవ నాయుడుతో కలిసి ఆయన సందర్శించారు. మండలంలో చేపట్టిన రీసర్వే ప్రక్రియపై తహసీల్దార్ ఉదయ్‌భాస్కర్, వీఆర్వోలతో ఆరా తీశారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా రీసర్వే పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. తర్వాత కూడేరులోని సర్వే నంబర్ 535 లో ఏర్పాటు చేసిన అహుడా లే–అవుట్, ఏపీఐఐసీ భూములను పరిశీలించారు.
వేటగాళ్ల ఉచ్చుకు
చిరుత కూన బలి
కళ్యాణదుర్గం రూరల్: వేటగాళ్లు పన్నిన ఉచ్చులో ఓ చిరుత కూన చిక్కుకుని ప్రాణాలు విడిచింది. చాపిరి సమీపంలో వేటగాళ్లు కుందేళ్ల కోసం పలు చోట్ల ఉచ్చులు ఏర్పాటు చేశారు. మంగళవారం అటువైపు వెళ్లిన కాపరులకు ఉచ్చులో చిక్కుకున్న రెండు చిరుత కూనలు కనిపించాయి. ఇందులో ఒకటి బయటపడేందుకు ప్రయత్నించి చివరకు మృతి చెందింది. మరొక కూనను తల్లి చిరుత నోటకరచుకుని రక్షించుకుంది. చిరుతల సంచారంపై అటవీ శాఖ అధికారులకు అనేకసార్లు సమాచారం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోయారు.


