● ఆర్డీటీ కోసం చేపట్టిన ధర్నాలు, లక్ష సంతకాల సేకరణ ఉద్యమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తడి పెంచాయి
● వైఎస్సార్‌సీపీతో పాటు అఖిలపక్ష పార్టీలు,
ప్రజాసంఘాల విజయం ఇది
● వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ: జిల్లా ప్రజలకు వరదాయినిగా నిలిచిన ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ కావడంతో ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం అనంతపురంలోని తన స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీతో పాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ప్రజాసంఘాల సమష్టి పోరాటాలతోనే ఈ అనుమతి దక్కిందన్నారు. ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య అధ్వర్యంలో జరిగిన పాదయాత్ర, సంతకాల సేకరణ కార్యక్రమాలు కేంద్రంపై ఎంతో ఒత్తడి పెంచాయన్నారు. ఢిల్లీ స్థాయిలో తమ పార్టీ ఎంపీలు ప్రధానిని కలిసి విన్నవించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యమంలో భాగంగా ఉరవకొండలో తాను చేపట్టిన సంతకాల సేకరణ, అఖిలపక్ష పార్టీల నేతలతో కలసి చేపట్టిన మహాధర్నా కూడా ఇందుకు కారణం కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు వైఎస్సార్‌సీపీ పోరాటాలకు సిద్ధమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ విజయంలో తమతో పాటు నడిచిన కాంగ్రెస్, వామపక్షపార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసు భద్రత వెబ్ పోర్టల్ ప్రారంభం
అనంతపురం సెంట్రల్: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ రూపొందించిన సీ్త్ర రక్ష– ప్రతి ఇంటికి పోలీసు భద్రత వెబ్ పోర్టల్‌ను ఎస్పీ జగదీష్ మంగళవారం ఆవిష్కరించారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసిన ఫిర్యాదులు తక్షణమే ఎస్పీ కార్యాలయంతో పాటు సంబంధిత పీఎస్‌లకు చేరుతుందన్నారు. వీటిపై వంద రోజుల్లో మిషన్‌మోడ్ తరహాల్లో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని బాధిత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్‌చౌదరి, ప్రొబేషనరీ ఐపీఎస్ అశ్విని మణిదీప్, మహిళా డీఎస్పీ మహబూబ్‌బాషా, వెబ్‌పోర్టల్ రూపకర్త లక్ష్మీనారాయణ చరణ్ పాల్గొన్నారు.
హత్యకేసులో నిందితులకు రిమాండ్
అనంతపురం సెంట్రల్: నగరంలో గత శనివారం రాత్రి చోటు చేసుకున్న ఆదర్శనాయుడు హత్య కేసులో ఐదుగురు నిందితులను త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో నగరంలోని వేణుగోపాల్ నగర్‌కు చెందిన కరమల్ల హుమాయూన్ అలియాస్ బన్ని, నీరుగంటివీధికి చెందిన కరుణాకర్‌రెడ్డి, రాణినగర్‌కు చెందిన కుమ్మర రాకేష్, బత్తపల్లి మండలం గంటాపురం నివాసి బోయపాటి అస్మిత్‌చౌదరి, బండి ఉజ్జినప్ప ఉన్నారు. ప్రధాన నిందితుడు బన్నీకి నగరానికి చెందిన వంశీకృష్ణతో రెండేళ్లుగా మనస్పర్థలున్నాయి. ఈ క్రమంలో వంశీకృష్ణతో పాటు ఆత్మకూరు మండలానికి చెందిన ఆదర్శనాయుడుపై ఈ నెల 22న బస్టాండ్ వద్ద దాడికి పాల్పడ్డారు. ఘటనలో టైల్స్ బండతో ఛాతిలో పొడవడంతో ఆదర్శనాయుడు (24) అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులను మంగళవారం గుత్తిరోడ్డు మార్కెట్‌యార్డు వద్ద అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.


